Mani Shankar Aiyar: 1962లో భారత్‌పై చైనా దాడి ఆరోపణే

పాకిస్థాన్‌ వద్ద అణుబాంబులు ఉన్నాయని, ఆ దేశాన్ని గౌరవించాలంటూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలతో చెలరేగిన వివాదం సద్దుమణగక ముందే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ తాజాగా  మరో వివాదానికి తెర లేపారు.

Published : 30 May 2024 05:43 IST

మణిశంకర్‌ అయ్యర్‌ మరో వివాదాస్పద వ్యాఖ్య
విమర్శలు రావడంతో క్షమాపణలు చెప్పిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత

దిల్లీ: పాకిస్థాన్‌ వద్ద అణుబాంబులు ఉన్నాయని, ఆ దేశాన్ని గౌరవించాలంటూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలతో చెలరేగిన వివాదం సద్దుమణగక ముందే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ తాజాగా  మరో వివాదానికి తెర లేపారు. భారత్‌పై చైనా దాడి చేయలేదని కేవలం ఆరోపణలు ఉన్నాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దిల్లీలో మంగళవారం సాయంత్రం ‘నెహ్రూస్‌ ఫస్ట్‌ రిక్రూట్స్‌’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో మణిశంకర్‌ అయ్యర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన 1962 నాటి భారత్‌-చైనా యుద్ధం గురించి ప్రస్తావిస్తూ.. ‘నాడు భారత్‌పై చైనా బలగాలు దాడి చేశాయనే ఆరోపణలు ఉన్నాయి’ అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ మెకాలే సంతానంతో కూడిన ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) ఉన్నత కులాల సర్వీసులా ఉండేదన్నారు. ప్రస్తుతం ఆ సర్వీసు దేశ ప్రయోజనాలతో కూడి మరింత ప్రజాస్వామ్యయుతంగా రూపాంతరం చెందిందని పేర్కొన్నారు. అయితే, వాస్తవంగా చైనా జరిపిన దాడిని అయ్యర్‌ ‘ఆరోపణ’ అని పేర్కొనడంతో దుమారం రేగింది. దీంతో ఆయన మంగళవారం బాగా పొద్దుపోయిన తరవాత తన వ్యాఖ్యలపై ఓ ప్రకటనలో క్షమాపణలు చెప్పారు. పొరపాటుగా తాను ‘ఆరోపణ’ అనే పదాన్ని ఉపయోగించినట్లు తెలిపారు. 

చైనా దండయాత్రను తుడిచేయాలనుకుంటున్నారు: భాజపా

అయ్యర్‌ వ్యాఖ్యలపై భాజపా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘‘38,000 చదరపు కిలోమీటర్ల మన భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించుకున్న నాటి చైనా దండయాత్రను చరిత్ర నుంచి తుడిచేయాలని మణిశంకర్‌ అయ్యర్‌ అనుకుంటున్నారు’’ అని భాజపా నేత అమిత్‌ మాలవీయ మండిపడ్డారు.

2020లో చైనా చొరబాట్లకు మోదీయే క్లీన్‌చిట్‌ ఇచ్చారు: కాంగ్రెస్‌

మణిశంకర్‌ అయ్యర్‌ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో కాంగ్రెస్‌ దీనిపై వివరణ ఇచ్చింది. ‘‘చైనా దాడికి మణిశంకర్‌ అయ్యర్‌ పొరపాటున ‘ఆరోపణ’ అనే పదాన్ని ఉపయోగించారు. ఇందుకు వెంటనే క్షమాపణలు తెలియజేశారు. ఈ వివాదానికి కాంగ్రెస్‌ దూరంగా ఉంటుంది. 1962లో భారత్‌పై చైనా జరిపిన దాడి వాస్తవమే. అలాగే 2020 మే నెలలోనూ లద్ధాఖ్‌లో చైనా ఆక్రమణలకు ప్రయత్నించింది. నాటి చైనా చొరబాట్లను ప్రధాని మోదీనే స్వయంగా ‘ఆరోపణ’గా అభివర్ణించి ఆ దేశానికి క్లీన్‌చిట్‌ ఇచ్చారు’’ అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి జైరాం రమేశ్‌ ప్రతిస్పందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని