Biren Singh: మణిపుర్‌ సీఎం సెక్యూరిటీ కాన్వాయ్‌పై కాల్పులు..!

మణిపుర్‌ ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ సెక్యూరిటీ కాన్వాయ్‌పై సాయుధలైన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

Updated : 10 Jun 2024 17:15 IST

ఇంఫాల్‌: జాతుల మధ్య వైరంతో అల్లకల్లోలంగా మారిన మణిపుర్‌ (Manipur)లో ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ (N Biren Singh) సెక్యూరిటీ కాన్వాయ్‌పై దాడికి ప్రయత్నాలు జరిగాయి. సోమవారం ఉదయం సాయుధులైన కొందరు తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. సీఎం కార్యాలయానికి చెందిన వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఈ ఘటన కాంగ్‌పోక్పి జిల్లాలో చోటుచేసుకొంది.

ఇటీవల జిరిబామ్‌ జిల్లాలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో రాష్ట్రంలో ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. 70కి పైగా ఇళ్లను తగలబెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరికొందరు పౌరులు వేరే చోటుకు పారిపోయినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో తమ వద్ద నుంచి లైసెన్స్‌ తుపాకులను జప్తు చేయడంతో వాటిని తిరిగి ఇచ్చేయాలంటూ స్థానికులు జిల్లా పోలీస్‌స్టేషన్‌ ఎదుట నిరసనకు దిగారు. ఇలా కొన్ని రోజులుగా అశాంతి నెలకొన్న ఈ ప్రాంతాన్ని సందర్శించాలని సీఎం బీరేన్‌సింగ్‌ అనుకున్నారు. ఈ క్రమంలోనే ఇంఫాల్ నుంచి జిరిబామ్‌కు సీఎం సెక్యూరిటీ కాన్వాయ్‌ బయల్దేరింది. దీనిపై సాయుధులైన తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని