Amit shah: చారిత్రక మైలు రాయి.. కేంద్రంతో యూఎన్‌ఎల్‌ఎఫ్‌ శాంతి ఒప్పందం

మణిపుర్‌లో సాయుధ గ్రూపు యూఎన్‌ఎల్‌ఎఫ్‌ కేంద్రంతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.

Published : 29 Nov 2023 19:18 IST

దిల్లీ: జాతుల ఘర్షణలతో అట్టుడికిన మణిపుర్‌లో శాంతి పునరుద్ధరణలో కీలక పురోగతి చోటుచేసుకుంది. ఇంఫాల్‌ లోయలోని తిరుగుబాటు గ్రూపు యునైటెడ్‌ నేషనల్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ (UNLF)తో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన శాంతి చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు. చారిత్రక మైలురాయిని అధిగమించామని పేర్కొన్నారు. బుధవారం దిల్లీలో యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యుఎన్‌ఎల్‌ఎఫ్) శాంతి ఒప్పందంపై సంతకం చేసిందని అమిత్‌ షా ప్రకటించారు.  దీంతో ఈశాన్య ప్రాంతంలో శాశ్వతంగా శాంతిని పునరుద్ధరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అవిశ్రాంత ప్రయత్నాలు నేటితో నెరవేరినట్లయిందని పేర్కొన్నారు. 

మణిపూర్‌లోని సాయుధ గ్రూపుగా వున్న UNLF హింసను వీడి ప్రధాన స్రవంతిలోకి వచ్చేందుకు అంగీకారం తెలిపిందని అమిత్‌షా తెలిపారు. వారందరినీ ప్రజాస్వామ్య ప్రక్రియలోకి స్వాగతిస్తున్నానని.. శాంతి, అభివృద్ధి మార్గంలో వారి ప్రయాణం సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారు తుపాకీలు వీడిన ఫొటోలను అమిత్ షా షేర్‌ చేసుకున్నారు.  మే 3న చెలరేగిన హింసాత్మక ఘటనలతో దద్దరిల్లిన మణిపుర్‌లో సాధారణ పరిస్థితులు కాస్త తగ్గుముఖం పట్టాయి.  ఈ నేపథ్యంలోనే ఇటీవల ముఖ్యమంత్రి ఎన్‌.బీరెన్‌ సింగ్‌ తమ ప్రభుత్వం శాంతి చర్చలు జరుపుతోందని ఓ వార్తాసంస్థకు వెల్లడించారు. అయితే.. ఆ సందర్భంలో ఆయన గ్రూపు వివరాలను  మాత్రం వెల్లడించలేదు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని