Manmohan Singh: ఉక్రెయిన్‌ సంక్షోభం.. భారత్‌ వైఖరిని సమర్థించిన మన్మోహన్‌ సింగ్

జీ20 సదస్సు వేళ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌(Manmohan Singh) మీడియాతో మాట్లాడారు. విదేశాంగ విధానం, చంద్రయాన్‌ ప్రయోగం గురించి స్పందించారు. 

Published : 08 Sep 2023 11:50 IST

దిల్లీ: రష్యా-ఉక్రెయిన్‌(Russia-Ukraine) మధ్య జరుగుతోన్న యుద్ధం విషయంలో భారత్‌ ప్రదర్శించిన స్వతంత్ర వైఖరి సరైందేనని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) అన్నారు. సార్వభౌమత్వం, దేశ ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చి మంచి పనిచేసిందని మెచ్చుకున్నారు. అదే సమయంలో శాంతిస్థాపన ఆవశ్యకతను ప్రస్తావించిందని గుర్తు చేశారు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విధంగా స్పందించారు.

భారత్‌ జీ20(G20) సదస్సుకు అధ్యక్షత వహిస్తుండటంపైనా మన్మోహన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘నా జీవితకాలంలో భారత్‌కు జీ20 అధ్యక్షత బాధ్యతలు రావడం సంతోషంగా ఉంది. జీ20 నేతలకు భారత్ ఆతిథ్యం ఇవ్వడాన్ని నేను చూస్తున్నాను. భారత పాలనా నిర్మాణంలో విదేశాంగ విధానం కీలకం. అయితే ఇది ప్రస్తుతం పార్టీల స్వప్రయోజనాలకు ముఖ్యమైన అంశంగా మారింది’ అని అన్నారు. తన హయాంలో పార్టీ రాజకీయాల కంటే విదేశాంగ విధానానికే అధిక ప్రాధాన్యం ఉండేదన్నారు. దౌత్యాన్ని పార్టీ రాజకీయాలకు ఉపయోగించే విషయంలో సంయమనం పాటించడం ముఖ్యమని అన్ని పార్టీలకు సూచించారు.

ప్రపంచానికి షాకిచ్చిన ఉత్తరకొరియా.. న్యూక్లియర్‌ అటాక్‌ సబ్‌మెరైన్‌ తయారీ

అలాగే రష్యా-ఉక్రెయిన్‌(Russia-Ukraine) మధ్య నెలకొన్న ఘర్షణలపై భారత్‌ స్పందనపై మాట్లాడుతూ..‘రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాల మధ్య ఘర్షణ నెలకొన్నప్పుడు ఏదోఒకదానికి మద్దతుగా నిలవడం ఇతర దేశాలకు కష్టమైన విషయం. ఈ విషయంలో దేశ సార్వభౌమత్వం, ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ భారత్ తీసుకున్న వైఖరి సరైందని నేను భావిస్తున్నాను. అలాగే సైనిక ఘర్షణను పరిష్కరించే వేదికగా జీ20ని ఎన్నడూ పరిగణించలేదు. అయితే భద్రతాపరమైన విభేదాలను పక్కనపెట్టి వాతావరణ మార్పులు, అసమానతలు, అంతర్జాతీయ వాణిజ్యంలో విశ్వాసాన్ని నెలకొల్పే అంశాలపై ఈ వేదిక దృష్టి పెట్టడం ముఖ్యం’ అని అన్నారు.

అలాగే భారత సరిహద్దుల పరిరక్షణకు మోదీ నేతృత్వంలోని సర్కారు అన్ని చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాను ఎలాంటి సలహా ఇవ్వదల్చుకోలేదన్నారు. చంద్రయాన్‌ పేరిట 2008లో మొదలైన ప్రయోగాలు సరికొత్త శిఖరాలకు చేరుకోవడం చాలా గర్వంగా ఉందన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి తరఫున 2004 నుంచి 2014 వరకు మన్మోహన్‌ సింగ్(Manmohan Singh) భారత ప్రధానిగా పనిచేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని