Republic Day: నారీ శక్తి, స్వదేశీ గన్లు, అగ్నివీరులు.. తొలి ప్రత్యేకతలెన్నో..!

దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ(Republic Day) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈసారి ఎన్నో అంశాలకు మొదటిసారి చోటు దక్కింది. 

Updated : 23 Jan 2024 16:18 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు(Republic Day) సంబరంగా జరుగుతున్నాయి. దేశంలోని విభిన్న సంస్కృతులను చాటేలా శకటాల ప్రదర్శన జరిగింది. సైనిక శక్తిని ప్రదర్శిస్తూ త్రివిధ దళాలు కవాతును నిర్వహించాయి. వీటిల్లో నారీ శక్తి, అగ్ని వీరులు ప్రధాన ఆకర్షణగా మారారు. ఇలా ఎన్నో మొదటి సారి చోటు చేసుకొన్న విశేషాలు ఉన్నాయి. 

ఇంతకుముందు వరకు పరేడ్‌ నిర్వహించే మార్గాన్ని రాజ్‌పథ్‌గా పిలిచేవారు.. కేంద్ర సర్కారు చేపట్టిన సెంట్రల్‌ విస్టా పునర్నిర్మాణంలో భాగంగా కొన్ని మార్పులు చేసిన ఈ మార్గం పేరును కర్తవ్య్‌ పథ్‌గా మార్చింది.  

ఈ వేడుకలకు మొదటిసారి ఈజిప్ట్‌ అధ్యక్షుడు హాజరయ్యారు. ఆ దేశానికి సైనిక బృందం కూడా ఈ కవాతులో పాల్గొంది. 

కొత్తగా సైన్యంలో చేరిన అగ్నివీరులు పరేడ్‌లో భాగమయ్యారు. 

సెంట్రల్ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(CRPF)కు చెందిన మహిళా బృందం ఈసారి వేడుకలకు ప్రధాన ఆకర్షణ. దీనికి అసిస్టెంట్ కమాండెంట్‌ పూనమ్ గుప్తా నేతృత్వం వహించారు. 29 ఏళ్ల దిశా అమృత్‌ 144 మంది యువ సైలర్లున్ననౌకాదళ కవాతు బృందానికి నేతృత్వం వహించారు. లెఫ్టినెంట్‌ చేతనాశర్మ ఆకాశ్‌ గగనతల రక్షణ వ్యవస్థకు నాయకత్వం వహించారు . వాయుసేన కవాతు బృందాన్ని స్క్వాడ్రన్‌ లీడర్‌ సింధూ రెడ్డి ముందుండి నడిపించారు. 

మాదక ద్రవ్యాల రవాణపై పోరాడే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) శకటాన్ని ప్రదర్శించడం విశేషం. 

 ఆత్మనిర్భర్‌ నినాదంలో భాగంగా.. ఈ సారి రష్యన్ ట్యాంకులను దూరం పెట్టారు. అర్జున్‌ యుద్ధ ట్యాంక్‌, ఆకాశ్‌ క్షిపణి వ్యవస్థను ప్రదర్శనకు ఉంచారు. అలాగే గౌరవవందనంలో దేశీయంగా రూపొందించిన 105ఎంఎం లైట్‌ ఫీల్డ్ గన్స్‌ను ఉపయోగించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని