lok sabha election 2024: మావోయిస్టుల గూడులో తొలిసారి పోలింగ్‌..!

మావోయిస్టులు ఝార్ఖండ్‌లో విముక్త ప్రాంతాలుగా ప్రకటించిన చోట్ల ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ అధికారులు ఈసారి సన్నాహాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఓటర్లు జీవితంలో తొలిసారి ఓటు వేసేందుకు సిద్ధమవుతున్నారు. 

Published : 07 Apr 2024 12:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మావోయిస్టుల కంచుకోటగా పేరున్న ప్రదేశంలో తొలిసారి ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఝార్ఖండ్‌ ‘సింహ్‌భూమ్‌’ (Singhbhum) పార్లమెంట్‌ నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల్లో 118 పోలింగ్‌ బూత్‌లను ఎన్నికల కమిషన్‌ ఏర్పాటు చేస్తోంది. ఇక్కడికి పోలింగ్‌ బృందాలను, సామగ్రిని హెలికాప్టర్లలో తరలించనున్నారు. ఇక్కడ మే13న ఎన్నికలు జరగనున్నాయి. ఆసియాలోని అత్యంత చిక్కటి సాల్‌ అడవి కేంద్రమైన సరండేలో ఈ సారి పోలింగ్‌ నిర్వహించడం ఈసీకి సవాలే. 

‘‘ఒక్క ఓటరు కూడా పోలింగ్‌కు దూరం కాకూడదనే లక్ష్యానికి కట్టుబడి ఉన్నాం. మావోయిస్టు వేర్పాటు వాదం బలపడిన ఈ ప్రాంతాల్లో కొన్ని చోట్ల తొలిసారి మరికొన్ని చోట్ల రెండు దశాబ్దాల తర్వాత జరుగుతున్న ఎన్నికలు ఇవి. మేము వెళ్లని ప్రాంతం ఉండదని చెబుతున్నాను’’ అని పశ్చిమ సింహ్‌భూమ్‌ జిల్లా కలెక్టర్‌ కుల్దీప్‌ చౌద్రీ పీటీఐకి తెలిపారు. ఇక్కడి నుగ్డి, బొరెరో ప్రాంతాల్లోని ప్రజలు జీవితంలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

ఏడాదిలో 22 మరణాలు..

పశ్చిమ సింహ్‌భూమ్‌ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. ఇక్కడ గతేడాది మొత్తం 46 తీవ్రవాద ఘటనలు చోటుచేసుకోగా.. 22 మంది మరణించారు. గతంలో మావోలు ఇక్కడి తాల్కోబాద్‌ ప్రాంతంలోని 22 గ్రామాలను విముక్త ప్రదేశాలుగా ప్రకటించారు. కానీ, భద్రతా దళాలు నిరంతరం ఆపరేషన్లు నిర్వహించి పట్టు సాధించాయి. ఈ ప్రాంతంలో మొత్తం 15 క్యాంపులను ఏర్పాటు చేశాయి. ప్రజలకు ఓటు హక్కు కల్పించేందుకు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ‘‘118 బూత్‌లున్న రోబోకేరా, బింజ్‌, తాల్కోబాద్‌, జరాయికేలా,హంసబేడా, రెంగ్రాథూ, ఛోటానగర్‌ వంటి చోట్ల సామగ్రిని ఎయిర్‌డ్రాప్‌ చేస్తాం. కొన్ని పోలింగ్‌ పార్టీలు రోడ్డు మార్గంలో వెళనున్నాయి. ఇక 121 బృందాలను రైళ్లలో తరలించనున్నాం. డ్రైరన్స్‌ పూర్తయ్యాయి. ఈ ప్రాంతంలో 100 ఏళ్లు దాటిన 62 మంది ఓటర్లు ఉండటం విశేషం. ఇక్కడి వృద్ధులు, వికలాంగులు ఇళ్ల వద్దే ఓటు హక్కు వినియోగించుకొనేలా ఏర్పాట్లు చేశాం. ప్రజలకు అవగాహన కల్పించేందుకు 1,284 చునావ్‌ పాఠశాలలను నిర్వహించాం’’ అని జిల్లా కలెక్టర్‌ కుల్దీప్‌ వెల్లడించారు. 

సింహ్‌భూమ్‌ ఎస్టీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి మాజీ ముఖ్యమంత్రి మధుకోడా సతీమణి గీతా గతంలో గెలిచారు. ఈ సారి భాజపా టికెట్‌పై ఆమె బరిలోకి దిగనున్నారు. ఇండియా కూటమి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని