Bhopal: భోపాల్‌ సాత్పురా భవన్‌లో సైన్యం సాయంతో మంటలు అదుపులోకి..

భోపాల్‌లో ప్రభుత్వ భవనాల సముదాయంలో మంటలను ఎట్టకేలకు అదుపులోకి తీసుకొచ్చారు. ఇందుకోసం సహాయక బృందాలు 14 గంటలకు పైగా శ్రమించాయి. 

Published : 13 Jun 2023 10:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌(Bhopal)లో కీలక ప్రభుత్వ కార్యాలయాలున్న సాత్పురా భవన్‌లో ఎట్టకేలకు మంటల(Massive Fire)ను అదుపు చేశారు. ఇందుకోసం వాయసేన (IAF), సైన్యం(Army), స్థానిక సహాయక బృందాలు దాదాపు 14 గంటలకు పైగా నిరంతరం శ్రమించాయి. మంటలు చెలరేగిన వెంటనే సిబ్బందిని బయటకు తరలించడంతో ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), హోం మంత్రి అమిత్‌షా(Amit Shah), రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh)తో ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌(Shivraj Singh Chouhan) మాట్లాడి సాయం కోరారు.

నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో ఈ భవనంలోని మూడో అంతస్తులో ఆదివాసీ సంక్షేమశాఖ ప్రాంతీయ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకొన్న విషయం తెలిసిందే. అనంతరం ఈ అగ్నికీలలు పై మూడు అంతస్తులకు కూడా వ్యాపించాయి. ఎయిర్‌ కండిషనర్లు, గ్యాస్‌ సిలిండర్లకు మంటలు తాకడంతో పేలుళ్లు కూడా సంభవించాయి. ఈ ప్రమాదంలో ఆరోగ్యశాఖకు చెందిన అత్యంత కీలకమైన ఫైళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. 

ఈ ఘటనపై భోపాల్‌ పోలీస్‌ కమిషనర్‌ హరినారాయణ చారి మిశ్రా మాట్లాడుతూ.. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుని ఉండొచ్చని ప్రాథమికంగా అంచనాకొచ్చినట్లు వెల్లడించారు. తమ నిపుణుల బృందాలు ఈ ఘటనకు కారణాలపై దర్యాప్తు చేస్తున్నాయని తెలిపారు. ‘‘మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చాము. కానీ, భవనంలోని చాలా చోట్ల నుంచి పొగ తీవ్రంగా వెలువడుతోంది. ఈ ప్రదేశాల్లో తర్వాత మంటలు వ్యాపించవచ్చు. మా బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రస్తుతానికి వాయుసేన హెలికాప్టర్లు అవసరం లేదు’’ అని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు