Prajwal Revanna: ఆ డెడ్‌లైన్‌ ముగిశాకే చర్యలు.. ప్రజ్వల్ దౌత్య పాస్‌పోర్టు రద్దుపై విదేశాంగ శాఖ

ప్రజ్వల్‌ రేవణ్న దౌత్య పాస్‌పోర్టు రద్దు చేసే అంశంపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది.

Updated : 30 May 2024 22:44 IST

Prajwal Revanna | దిల్లీ: మహిళలపై లైంగిక వేధింపులు, దౌర్జన్యాల ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్న (Prajwal Revanna) దౌత్య పాస్‌పోర్టు (diplomatic passport) రద్దు చేసే అంశంపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. పాస్‌పోర్టు రద్దు చేసే విషయంలో తాము పంపిన షోకాజ్‌ నోటీసుపై స్పందించేందుకు ఆయనకు జూన్‌ 2 వరకు గడువు ఉందని తెలిపింది. అప్పటికీ స్పందించకపోతే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. మే 31న ప్రజ్వల్‌ జర్మనీ నుంచి భారత్‌కు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మీడియా సమావేశంలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ ఈ విధంగా స్పందించారు. దౌత్య పాస్‌పోర్టు రద్దు చేయాలని కర్ణాటక ప్రభుత్వం మే 21న కోరగా.. భారతీయ పాస్‌పోర్టు చట్టం ప్రకారం మే 23న షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కోరిన విధంగా దౌత్య పాస్‌పోర్టును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ ప్రజ్వల్‌కు జారీ చేసిన షోకాజ్‌ నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలిపారు.

‘‘మే 23న ప్రజ్వల్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేశాం. దీనిపై ఆయన 10 రోజుల్లోగా స్పందించాల్సి ఉంది. ఆయన స్పందన కోసమే చూస్తున్నాం. ఏం సమాధానం చెబుతారో విన్న తర్వాత లేదా 10 రోజుల నోటీసు గడువు ముగిసిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటాం’’ అని జైశ్వాల్‌  తెలిపారు.

కర్ణాటకలోని హాసన లోక్‌సభ ఎన్నిక ముగిసిన వెంటనే ఏప్రిల్‌ 27న ప్రజ్వల్‌ జర్మనీకి వెళ్లిన విషయం తెలిసిందే. జర్మనీకి వెళ్లిన ఆయన దౌత్య పాస్‌పోర్టును రద్దు చేయాలంటూ మే 1న ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య.. గత వారంలోనూ మరో లేఖ రాశారు. ప్రజ్వల్‌ దౌత్య పాస్‌పోర్టు రద్దు చేసే విషయంలో సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు, ప్రజ్వల్‌ రేవణ్న విదేశాల నుంచి మే 30న బెంగళూరుకు వచ్చేందుకు విమాన టికెట్లు బుక్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది.  ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తిరస్కరించడంతో మే 31న బెంగళూరులో దిగగానే సిట్‌ అధికారులు విమానాశ్రయంలోనే అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని