నేను ఏ సంతకం చేయలేదు: ‘హమాస్‌ ప్రశ్న’ వార్తలపై కేంద్రమంత్రి

Israel- Hamas Conflict: హమాస్‌ సంస్థ విషయంలో పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు తాను సమాధానం ఇచ్చినట్టుగా ఉన్న కాగితాలు వైరల్‌ కావడంపై కేంద్రమంత్రి మీనాక్షి లేఖి స్పందించారు. 

Updated : 09 Dec 2023 15:52 IST

దిల్లీ: హమాస్‌(Hamas)ను ఉగ్రసంస్థగా ప్రకటించే అంశంపై లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా తాను ఏ దస్త్రంపై సంతకం చేయలేదని కేంద్రమంత్రి మీనాక్షి లేఖి (Meenakshi Lekhi) స్పష్టం చేశారు. భారత్‌ దానిని ఉగ్రసంస్థగా ప్రకటించే యోచనలో ఉందా..? అనే ప్రశ్నతో కూడిన దస్త్రాలపై సంతకం చేశానంటూ వస్తున్న వార్తలను ఆమె ఖండించారు.

హమాస్‌కు సంబంధించి మంత్రి సమాధానం ఇచ్చినట్టుగా ఉన్న కొన్ని దస్త్రాలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘మీ ముందు తప్పుడు సమాచారం ఉంది. ఈ అంశంలో ఏ పేపర్‌పై నేను సంతకం చేయలేదు. విచారణ ద్వారా బాధ్యులు బయటకు వస్తారు’ అని లేఖి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆమె విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. మంత్రి ఇచ్చిన స్పష్టత పై శివసేన(యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది స్పందించారు. ‘ఫోర్జరీ జరిగి ఉంటుందని ఆమె అనుకుంటున్నారా..? ఒకవేళ అదే నిజమైతే.. ఇది తీవ్రస్థాయి నిబంధనల ఉల్లంఘనే. దీనిపై ఆమె నుంచి స్పష్టత వస్తే మేం సంతోషిస్తాం’ అని అన్నారు.

హమాస్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించాలని ఇజ్రాయెల్‌ రాయబారి భారత్‌ను అభ్యర్థించారు. కానీ ఆ దిశగా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇజ్రాయెల్‌-హమాస్‌ పోరు మరింత విస్తరిస్తుండటంపై మాత్రం భారత్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. శాంతియుత మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పిలుపునిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని