Encounter Specialist: ఎన్‌కౌంటర్ల ‘లక్ష్మణ్‌’.. మావోయిస్టులకు సింగం

Encounter Specialist: బస్తర్‌లో మంగళవారం చోటుచేసుకున్న భారీ యాంటీ నక్సల్స్‌ ఆపరేషన్‌కు ఓ ఇన్‌స్పెక్టర్‌ నేతృత్వం వహించారు. ఆయన ఓ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌..! మావోయిస్టులకు సింగంగా ఆయనకు పేరుంది. 

Updated : 18 Apr 2024 11:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మణ్‌ కేవట్‌ (Laxman Kewat).. ఈ పేరు చెబితే మావోయిస్టులకు గుండె దద్దరిల్లుతుంది. అవును మరి.. తన 17 ఏళ్ల కెరీర్‌లో దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నారాయన. బెదిరింపులను లెక్కచేయకుండా మావోయిస్టులను ఏరిపారేస్తున్నారు. ఇప్పటి వరకు 100కు పైగా ఆపరేషన్లలో పాల్గొన్నారు. ఫలితంగా ‘ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ (Encounter Specialist)’గా మారారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) రాష్ట్రంలోని కాంకేర్‌ జిల్లాలో జరిగిన భారీ ఆపరేషన్‌కు ఆయనే మాస్టర్‌ మైండ్‌..!

మంగళవారం నాటి ఎన్‌కౌంటర్‌కు ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మణ్‌ ప్రధాన వ్యూహకర్తగా వ్యవహరించారు. దీనికి నేతృత్వం వహించింది కూడా ఆయనే. కాల్పుల సమయంలో భద్రతా బలగాలకు ఎదురైన సవాళ్లని మీడియాకు వెల్లడించారు. ‘‘కొటారీ నదికి అవతలివైపు ఉండే కొండ ప్రాంతాన్ని మావోయిస్టులు ‘లిబరేటెడ్‌ జోన్‌’గా పిలుస్తారు. వారికి తెలియకుండా అక్కడ చీమచిటుక్కు మనదనేది వాస్తవం. అలాంటి ప్రాంతంలో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో సమావేశమైనట్లు సమాచారం రాగానే మేం ఆపరేషన్‌కు సిద్ధమయ్యాం. అయితే అక్కడకు వెళ్లడం సవాళ్లతో కూడుకున్న పని. ఉక్కపోత, కొండలు, తాగునీటి కొరత.. ఇవన్నీ దాటుకుని 200 మంది భద్రతా సిబ్బందితో అక్కడకు చేరుకున్నాం’’ అని లక్ష్మణ్‌ వెల్లడించారు.

‘‘మంగళవారం ఉదయం మేం వారిపై మెరుపుదాడి చేయాలని ప్రయత్నించినప్పుడు మావోయిస్టు సంఘం సభ్యుడొకరు బాంబులు పేల్చి అగ్రనాయకులకు హెచ్చరికలు జారీ చేశాడు. దీంతో వారు అలర్ట్‌ అయ్యారు. ఫలితంగా మేం కొన్ని గంటల పాటు అక్కడే దాక్కోవాల్సి వచ్చింది. మావోయిస్టు క్యాంప్‌నకు 300 మీటర్ల సమీపానికి చేరుకున్న తర్వాత మా కదలికలను వారు పసిగట్టకుండా ఉండేందుకు పాకుతూ వెళ్లాం. వారిని ఎలాంటి అనుమానం రాకుండా ఆ ప్రాంతాన్ని అష్టదిగ్బంధం చేశాం. కానీ, ఈ అడవుల్లో చిన్న అలికిడిని కూడా వారు గుర్తించగలరు. అలా మా రాకను తెలుసుకుని కాల్పులు మొదలుపెట్టారు. దీంతో మేం ఎదురుకాల్పులకు దిగాం’’ అని నాటి అనుభవాలను వివరించారు.

ఎవరీ లక్ష్మణ్‌..?

39 ఏళ్ల లక్ష్మణ్‌ 2007లో ఛత్తీస్‌గఢ్‌ పోలీసు శాఖలో చేరారు. తొలుత సురాజ్‌పుర్‌లో కానిస్టేబుల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఐదేళ్లకు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ప్రమోట్‌ అవ్వగానే తొలి పోస్టింగ్‌ బీజాపుర్‌లో ఇచ్చారు. ఆ రాష్ట్రంలోని అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైన బీజాపుర్‌, సుక్మా, నారాయణ్‌పుర్‌, అబూఝ్‌మాడ్‌ వంటి ప్రాంతాల్లో ఆయన పనిచేశారు. తన కెరీర్‌లో దండకారణ్యంలో అనేక యాంటీ-నక్సల్స్‌ ఆపరేషన్లలో పాల్గొన్నారు. 100కు పైగా ఎన్‌కౌంటర్లలో దాదాపు 44 మంది మావోయిస్టులను మట్టుబెట్టారు. గతంలో ఆయనకు బెదిరింపులు కూడా వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని