Shraddha Walkar: ఆఫ్తాబ్‌కు మరోసారి పాలిగ్రాఫ్‌ టెస్ట్‌

శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో నిందితుడికి పోలీసులు మరోసారి పాలిగ్రాప్‌ పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత నార్కో ఎనాలసిస్‌ పరీక్ష చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు.

Published : 28 Nov 2022 15:10 IST

దిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్‌ ఆమిన్‌ పూనావాలాకు అధికారులు మరోసారి పాలిగ్రాఫ్‌ పరీక్ష నిర్వహించారు. దిల్లీ రోహిణిలోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీలో ఆయనకు మరోసారి ఈ పరీక్ష చేపట్టారు. ఉదయం 9.50గంటలకు ల్యాబ్‌కు చేరుకోగా.. 11 గంటల నుంచి నిపుణులు పాలిగ్రాఫ్‌ పరీక్ష మొదలుపెట్టినట్లు సమాచారం. గతవారం కూడా ఆయనకు ఈ పరీక్ష నిర్వహించినప్పటికీ అందులో కొన్ని సెషన్లపై అధికారులు సంతృప్తికరంగా లేనట్లు తెలుస్తోంది. తాజా పాలిగ్రాఫ్‌ పరీక్షలో ఆఫ్తాబ్‌ సహకరించాడా లేదా అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు.

ఈ హత్య కేసులో కీలక ఆధారాలను చేజిక్కించుకునేందుకు అన్వేషణ కొనసాగిస్తోన్న దర్యాప్తు అధికారులు.. ఇప్పటికే నిందితుడి కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. ఆవేశంలోనే శ్రద్ధాను చంపినట్టు దిల్లీ కోర్టుకు ఆఫ్తాబ్‌ గతవారం వెల్లడించినట్లు వార్తలు వచ్చినప్పటికీ నిందితుడి తరఫున న్యాయవాది మాత్రం దీంతో విభేదించారు. ఈ కేసులో వాస్తవాలను నిర్ధారించుకునేందుకు గాను కోర్టు అనుమతితో ఆఫ్తాబ్‌కు గత వారమే అధికారులు పాలిగ్రాఫ్‌ పరీక్ష ప్రారంభించారు. అయితే, అతడికి స్వల్ప అనారోగ్యం ఉండడంతో అధికారులు దానిని కొనసాగించలేదు. నవంబర్‌ 28, 29తేదీలతోపాటు డిసెంబర్‌ 5న ఎఫ్‌ఎస్‌ఎల్‌ పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.

ఈ హత్యలో ముమ్మర దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ శ్రద్ధా వాకర్‌కు చెందిన శరీర భాగాల ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదు. వీటితోపాటు హత్యకు వినియోగించిన ఆయుధం కూడా దొరకలేదు. మరోవైపు పాలిగ్రాఫ్‌ పూర్తయ్యేంత వరకూ నార్కో ఎనాలసిస్‌ పరీక్ష చేపట్టే అవకాశంలేదని ఎఫ్ఎస్‌ఎల్‌ ఉన్నతాధికారి సంజీవ్‌ గుప్తా పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు