Shraddha Murder: శ్రద్ధా హత్య కేసు.. డీఎన్‌ఏ నివేదిక ఆలస్యమెందుకో..?

శ్రద్ధా హత్య కేసులో డీఎన్‌ఏ నివేదిక ఆలస్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నివేదిక ఆలస్యం తప్పుడు సంకేతాలు పంపిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Updated : 29 Nov 2022 16:58 IST

దిల్లీ: సంచలనం సృష్టించిన కాల్ సెంటర్‌ ఉద్యోగి శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్‌ ఆమిన్‌ పూనావాలను అరెస్టు చేసి రెండు వారాలకు పైనే అయ్యింది. నిందితుడు చెప్పిన వివరాల మేరకు శ్రద్ధావిగా భావిస్తున్న కొన్ని శరీర భాగాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అవి మృతురాలివేనా? అని చెప్పేందుకు మాత్రం ఇంతవరకూ ఎలాంటి ఆధారాల్లేవు. దీన్ని తేల్చేందుకు చేపట్టిన డీఎన్‌ఏ పరీక్షల నివేదిక ఇంతవరకూ రాకపోవడంపై ఫోరెన్సిక్‌ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే సిబ్బంది కొరత కారణంగానే జాప్యం జరుగుతోందని అధికారులు చెబుతుండటం గమనార్హం.

శ్రద్ధా హత్య కేసులో ఆఫ్తాబ్‌ను నవంబరు 12న దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత మెహ్‌రౌలీ అటవీ ప్రాంతంలో శ్రద్ధావిగా భావిస్తున్న కొన్ని శరీర అవశేషాలను గుర్తించిన పోలీసులు వాటిని నవంబరు 13న డీఎన్‌ఏ పరీక్షలకు పంపించారు. ఈ పరీక్షల్లో వచ్చిన డీఎన్‌ఏతో శ్రద్ధా కుటుంబ సభ్యుల డీఎన్‌ఏను సరిపోల్చి.. అవి మృతురాలివా? కాదా? అన్నది తెలుసుకోవచ్చు. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన నివేదిక ఇంతవరకూ రాలేదు. దీనిపై అధికారులు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు. ‘‘ఇలాంటి కేసుల్లో మేం అత్యంత గోప్యత పాటిస్తాం. అందుకే ఆ శరీర భాగాల గురించి బయటకు ఎలాంటి వివరాలు చెప్పట్లేదు’’ అని రోహిణి ప్రాంత ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీ అసిస్టెంట్‌ పీఆర్‌ఓ రజనీశ్‌ కుమార్‌ చెప్పారు.

అయితే నివేదిక ఆలస్యంపై ఫోరెన్సిక్‌ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ‘‘మానవ అవశేషాలు భద్రపర్చని స్థితిలో ఉన్నా.. ఏడాది క్రితం నాటివైనా వాటి నుంచి డీఎన్‌ఏను తెలుసుకునేందుకు 24 గంటల కంటే ఎక్కువ సమయం పట్టదు. ఆరు నెలల తర్వాత లభించిన మృతదేహాలకు చర్మం, మాంసం లేకపోయినా ఎముకల్లో ఉండే మజ్జ లాంటి కణజాలం ఏడాది వరకు సజీవంగానే ఉంటుంది. దాంతో సులువగానే డీఎన్‌ఏను తెలుసుకోవచ్చు’’ అని బనారస్‌ హిందూ యూనివర్సిటీకి చెందిన జెనెటిక్స్‌ ప్రొఫెసర్‌ జ్ఞానేశ్వర్‌ చౌబే అన్నారు. 2021లో జార్జియా రాణి కెటెవాన్‌ 400 ఏళ్ల హత్య మిస్టరీని  డీఎన్ఏ ద్వారా ఛేదించిన బృందంలో చౌబే కూడా సభ్యుడిగా ఉన్నారు. శ్రద్ధా కేసులో డీఎన్‌ఏ పరీక్షలు ఆలస్యమవడం దురదృష్టకరమని, దీని వల్ల ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు వెళ్తాయని ఆయన అన్నారు. ఈ కేసులో డీఎన్‌ఏను ఐసోలేట్‌ చేయడం బహుశా సవాల్‌గా మారొచ్చని మరో ఫోరెన్సిక్‌ నిపుణులు డా. తంగరాజ్‌ అన్నారు. అయితే ఇలాంటి కేసుల్లోనూ డీఎన్‌ఏను గుర్తించేందుకు మూడు రోజులకు మించి పట్టదని తెలిపారు.

సిబ్బంది కొరత వల్లేనా..?

అయితే రాష్ట్ర ప్రభుత్వ లాబొరేటరీల్లో సిబ్బంది కొరత కారణంగానే ఈ నివేదికలు ఆలస్యమవుతున్నాయని ఫోరెన్సిక్‌ అధికారులు చెబుతున్నారు. శ్రద్ధా కేసును చేపట్టిన ఎఫ్‌ఎస్‌ఎల్‌ రోహిణి లాబొరేటరీలో వర్క్‌ లోడ్‌కు తగినంత డీఎన్‌ఏ నిపుణులు అందుబాటులో లేరని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సగం మందితోనే ఈ లాబొరేటరీ నడుస్తున్నట్లు తెలుస్తోంది. పెండింగ్‌ కేసులు ఎక్కువగా ఉండటం, ప్రాధాన్యత క్రమాల వల్లే ఈ నివేదిక ఆలస్యమవుతున్నట్లు సమాచారం.

ఆఫ్తాబ్‌కు భారీ భద్రత..

సోమవారం ఫోరెన్సిక్‌ పరీక్షల అనంతరం ఆఫ్తాబ్‌ను ల్యాబ్‌ నుంచి జైలుకు తరలిస్తుండగా కొందరు వ్యక్తులు కత్తులతో పోలీసు వ్యాన్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో అతడికి భద్రతను పెంచారు. మంగళవారం ఉదయం మిగతా ఫోరెన్సిక్‌ పరీక్షల కోసం అతడిని మరోసారి ఎఫ్‌ఎస్‌ఎల్‌ రోహిణి ల్యాబ్‌కు తరలించారు. భారీ భద్రత మధ్య అతడిని ఇక్కడకు తీసుకొచ్చారు. ల్యాబ్‌ ముందు కూడా భారీగా పోలీసులు మోహరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని