‘అమృత్‌ మహోత్సవ్‌’కు మోదీ శ్రీకారం

దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం శ్రీకారం చుట్టారు. గుజరాత్‌లోని

Updated : 27 Dec 2022 18:25 IST

అహ్మదాబాద్‌: దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం శ్రీకారం చుట్టారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గల సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు నిర్వహించే పాదయాత్రను ఆయన నేడు జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు అమృత్‌ మహోత్సవ్‌ వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంరభించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులను మోదీ స్మరించుకున్నారు. స్వాతంత్ర్య పోరాటంలో దేశంలోని అన్ని వర్గాలు పాల్గొన్నాయని, ఆ పోరాట స్ఫూర్తిని దేశం ముందుకు తీసుకెళ్తోందని అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో భారత్‌ యావత్‌ ప్రపంచానికి ఆశాకిరణంలా మారిందని కొనియాడారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో స్వావలంబన సాధించడంతో పాటు ఇతర దేశాలకు కూడా అందించే స్థాయికి ఎదిగామన్నారు.

దండి మార్చ్‌ వార్షికోత్సవం సందర్భంగా నేడు ఈ పాదయాత్ర చేపట్టారు. స్వాతంత్య్రోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన దండియాత్ర ప్రారంభమైన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ సబర్మతి ఆశ్రమం నుంచి నవసారిలోని దండి వరకు 81 మంది 241 మైళ్ల దూరం పాదయాత్ర చేయనున్నారు. 25రోజుల పాటు సాగనున్న ఈ పాదయాత్ర ఏప్రిల్‌ 5న ముగియనుంది. ఆ రోజున దండిలో భారీ కార్యక్రమం నిర్వహించనున్నారు. 

75ఏళ్ల స్వాతంత్ర్య సంబరాలకు గుర్తుగా కేంద్రం ‘అమృత్‌ మహోత్సవ్‌’ కార్యక్రమం చేపట్టింది. నేటి నుంచి దేశవ్యాప్తంగా 75 ప్రాంతాల్లో 75 వారాల పాటు వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహించనుంది. వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తి కానుంది.

బాపూజీకి నివాళి..

అమృత్‌ మహోత్సవ్‌ ప్రారంభోత్సవం కోసం ఈ ఉదయం అహ్మదాబాద్‌ చేరుకున్న మోదీ నేరుగా సబర్మతీ ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అభయ్‌ ఘాట్‌ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను ప్రధాని తిలకించారు.

‘స్థానికం’ కోసం గళమెత్తుదాం

అంతకుముందు ప్రధాని మోదీ ట్విటర్‌ వేదికగా ఆసక్తికర పోస్ట్‌ చేశారు. స్థానిక వస్తువులు కొని వాటిని వోకల్‌ ఫర్‌ లోకల్‌ యాష్‌ ట్యాగ్‌తో సోషల్‌మీడియాలో పోస్ట్‌చేయాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. స్థానిక ఉత్పత్తులకు ప్రచారం కల్పించడమే గాంధీజీకి ఘనమైన నివాళి అని మోదీ ఈ సందర్భంగా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని