PM-KISAN: పీఎం కిసాన్‌.. 12వ విడత సాయం విడుదల

పీఎం-కిసాన్‌ పథకం కింద 12వ విడత ఆర్థిక సహాయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు.

Published : 17 Oct 2022 16:45 IST

దిల్లీ: దేశంలో అన్నదాతలకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పీఎం-కిసాన్‌ (PM KISAN) పథకం కింద 12వ విడత నగదును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 11కోట్ల మంది లబ్ధిదారులకు గాను రూ.16వేల కోట్లను అందించనున్నారు. దీంతో ఇప్పటివరకు ఈ పథకం కింద మొత్తం రూ.2.16లక్షల కోట్ల సహాయం అందించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

దిల్లీలోని పుసా క్యాంపస్‌లో ‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌ సమ్మేళన్‌ 2022’ పేరుతో రెండు రోజులపాటు జరుగుతోన్న కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘పీఎం కిసాన్‌’ 12వ విడత ఆర్థిక సహాయాన్ని విడుదల చేయడంతోపాటు ‘వన్‌ నేషన్‌ వన్‌ ఫర్టిలైజర్‌’ పథకాన్నీ ఆరంభించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 600 పీఎం కిసాన్‌ సమృద్ధి కేంద్రాల(PM-KSK)ను ప్రధాని మోదీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ.. ‘వన్‌ నేషన్‌, వన్‌ ఫర్టిలైజర్‌’లో భాగంగా ‘భారత్‌’ అనే బ్రాండు పేరుతో దేశవ్యాప్తంగా ఒకేరకమైన యూరియా అందుబాటులో ఉంటుంది. దీనిద్వారా చౌక ధరలో రైతులకు ఎరువులు లభ్యమవుతాయి. రైతులకు ఉపయోగకరంగా ఉండేందుకు నానో యూరియాను తీసుకువచ్చాం. ఉత్పాదకతను పెంచేందుకు రైతులకు 22కోట్ల భూసార కార్డులతోపాటు 1700 రకాల విత్తనాలను అందుబాటులో ఉంచాం’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

దిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌, రసాయనాలు & ఎరువుల మంత్రిత్వశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయలు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 13,500 మంది అన్నదాతలు, 1500 వ్యవసాయ స్టార్టప్‌ల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (PM-KISAN) కింది దేశంలో అర్హులైన రైతులకు ప్రతి ఏడాది రూ.6వేల ఆర్థిక సహాయం అందిస్తోన్న సంగతి తెలిసింది. వీటిని ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండువేల చొప్పున ఏడాదికి మూడు విడతల్లో అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ ఆర్థిక సహాయం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని