PM Modi: కాంగ్రెస్‌కు ఓటేస్తే పూడ్చలేని నష్టం.. మూడోసారి గెలుపుపై అనుమానం అక్కర్లేదు: ప్రధాని మోదీ

నవభారత్‌ నిర్మాణం కోసం 24 గంటలు పనిచేద్దామని భాజపా పార్టీ శ్రేణులకు ఆ పార్టీ నేత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 

Updated : 18 Feb 2024 16:36 IST

దిల్లీ: నవభారత్‌ నిర్మాణం కోసం అహర్నిశలు పనిచేద్దామని భాజపా (BJP) శ్రేణులకు ఆ పార్టీ నేత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పిలుపునిచ్చారు. భాజపా జాతీయ మండలి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వచ్చే వంద రోజులు పార్టీకి ఎంతో కీలకమని, ఈసారి 370 సీట్ల మైలురాయిని అందుకోవాలన్నారు. ‘గడిచిన పదేళ్లలో దేశ రూపురేఖలు మారిపోయాయి. 25 కోట్లమంది పేదరికం నుంచి బయటపడ్డారు. భారత్‌ అభివృద్ధిని ప్రపంచమంతా గుర్తిస్తోంది. దేశం కోసం మనం చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఏక్‌భారత్‌, శ్రేష్ట్‌ భారత్‌ అన్నదే మన నినాదం’’అని తెలిపారు.

మూడోసారి గెలుపుపై అనుమానం అక్కర్లేదు

‘‘మూడోసారి గెలుపుపై ఎవరికీ ఎలాంటి అనుమానం అక్కర్లేదు. రాజకీయ పండితులెవరికీ మన గెలుపు కారణాలు దొరకవు. నేను వీధుల వెంట వెళ్తున్నప్పుడు ప్రజల ఆశీర్వాద వర్షం కురుస్తోంది. భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతీయ మూలసూత్రం. భిన్నత్వంలో ఏకత్వం మరింత బలోపేతం దిశగానే పనిచేస్తున్నాం’’అని ప్రధాని మోదీ చెప్పారు. 

కాంగ్రెస్‌కు ఓటేస్తే పూడ్చలేని నష్టం

‘‘నిరంతర త్యాగాల వల్లే ప్రజల విశ్వాసం చూరగొన్నాం. ప్రతిపక్షాలు అని  చెప్పే పార్టీలన్నీ కుటుంబ పార్టీలే. అక్కడ అధికారం వారసత్వంగా సంక్రమిస్తుంది. భాజపా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం. దేశంలో అనేక అనర్థాలకు కాంగ్రెస్‌ పార్టీయే కారణం. అధికారం సంపాదించాలనే ఆలోచన తప్ప దేశాభివృద్దికి ఆ పార్టీ వద్ద అజెండా లేదు. రక్షణ దళాల సామర్థ్యంపై కాంగ్రెస్‌కు స్పష్టత లేదు. నూతన సాంకేతిక పరిజ్ఞానం, నవీన ఆయుధ సంపత్తితో సైనిక దళాలను బలోపేతం చేశాం. కానీ, ఆ పార్టీ నిరంతరం రక్షణ దళాల సామర్థ్యాన్ని శంకిస్తుంది. ప్రజలందరికీ ఒక్కటే విజ్ఞప్తి. మోదీపై కోపంతో కాంగ్రెస్‌కు ఓటేస్తే పూడ్చలేని నష్టం జరుగుతుంది’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.  

సుపరిపాలన అందించాం 

‘‘నిజాయతీ, సుపరిపాలనను ప్రజలు ఆదరిస్తారు. గత పదేళ్లలో ప్రాంతీయ భేదం లేకుండా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాం. పేద, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. కుంభకోణాలు లేని పాలన అందించాం. ఉగ్రవాదాన్ని అణచివేశాం. మౌలిక సదుపాయాలు మెరుగైతే యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయి. జీఎస్టీ వసూళ్లు 11 లక్షల కోట్లకు పెరిగాయి. పన్నుల రూపంలో లభించే ఆదాయం పెరగడంతో అభివృద్ధి పథకాల అమలు మెరుగవుతోంది. సేద్యంలో ఆధునిక పద్ధతులను అవలంబించినప్పుడే రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది. అణగారిన వర్గాల అభివృద్ధే మా ప్రభుత్వ లక్ష్యం’’ అని మోదీ తెలిపారు.

వారి కలల్ని నెరవేర్చడమే నా లక్ష్యం

దేశంలోని మహిళలు, పేదలు, యువత కలల్ని నెరవేర్చడమే తన లక్ష్యమని తెలిపారు. ‘‘ఆరోగ్యకరమైన మహిళలతోనే ఆరోగ్యవంతమైన దేశం సాకారమవుతుంది. పోషణ్‌ అభియాన్‌ కింద గర్భిణులకు పోషకాహారం అందిస్తున్నాం. 10 కోట్ల మంది మహిళలకు ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చాం. వారి రక్షణ కోసం కఠినమైన చట్టాలను తీసుకొచ్చాం. రికార్డు స్థాయిలో ఆస్పత్రులు, వైద్య కళాశాలలు నిర్మించాం. 25 కోట్ల ఇళ్లకు శౌచాలయ సదుపాయం కల్పించాం’’ అని వెల్లడించారు.

మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్‌

‘‘ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తుంది. ఇది మోదీ గ్యారెంటీ. పశ్చిమాసియా దేశాలతో భారత్‌ సంబంధాలు గతంలో కంటే మెరుగయ్యాయి. సాంకేతికత, ఆహార పదార్థాలను ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాం. ఇంధన రంగంలో వస్తున్న మార్పులు దేశానికి కొత్త మార్గాలు వేస్తున్నాయి. ఓడరేవులు, పారిశ్రామిక పార్కుల అనుసంధానంతో ఎగుమతులు పెరుగుతున్నాయి. గ్రీన్‌ ఎనర్జీ, సౌర విద్యుత్‌లు దేశానికి కొత్త ఆదాయ వనరులుగా మారుతున్నాయి’’ అని ప్రధాని తన ప్రసంగంలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని