Rajnath Singh: మోదీ చొరవ వల్లే.. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కొద్దిసేపు ఆగిపోయింది..!

ప్రధాని మోదీ(PM Modi) చొరవ వల్లే ఉక్రెయిన్‌ నుంచి భారతీయులు సురక్షితంగా స్వదేశానికి చేరుకోగలిగారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ (Rajnath Singh) అన్నారు. మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆనాటి సంగతిని గుర్తుచేసుకున్నారు. 

Updated : 15 May 2023 10:57 IST

ముంబయి: యుద్ధంతో కునారిల్లుతున్న ఉక్రెయిన్‌(Ukraine Crisis) నుంచి భారత విద్యార్థుల తరలింపు విషయంలో ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) కీలక పాత్ర పోషించారని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Union Defense Minister Rajnath Singh) ప్రశంసించారు. ఆయన చొరవ వల్లే రష్యా, ఉక్రెయిన్‌ మధ్య కొద్దిసేపు యుద్ధం ఆగిందని చెప్పారు. ఆదివారం మహారాష్ట్రలోని శంభాజీనగర్‌లో జరిగిన వీర్‌ శిరోమణి మహారాణా ప్రతాప్‌ మహా సమ్మేళన్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘ప్రధాని మోదీ(PM Modi).. రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మాట్లాడారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తోనూ మాట్లాడారు. దాంతో యుద్ధం కొద్దిసేపు ఆగిపోయింది. ఆ తర్వాత విద్యార్థులు క్షేమంగా భారత్‌కు రాగలిగారు. మరే దేశమూ చేయలేని పనిని మోదీ చేశారు’ అని రాజ్‌నాథ్‌ గుర్తుచేసుకున్నారు. అలాగే మహారాణా ప్రతాప్‌ చూపిన తెగువ, త్యాగాలను ప్రస్తావించారు. ‘రాణా ప్రతాప్‌ గడ్డితో చేసిన రోటీలు తిన్నారు. కానీ, ఆత్మగౌరవం విషయంలో మాత్రం రాజీపడలేదు. అది హల్దీఘాట్‌ అయినా, గల్వాన్‌ లోయ అయినా.. భారత్ ఎప్పటికీ తలవంచదు. మీరు ఆయన అంకితభావాన్ని అర్థం చేసుకోగలిగితే.. ఆ కాలాన్ని మొఘల్ శకమని కాకుండా మహరాణా శకమని పిలుస్తారు’ అని వ్యాఖ్యానించారు.  

గత ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌ (Ukraine)పై రష్యా(Russia) సైనికచర్య ప్రారంభించింది. అక్కడ చదువుకుంటున్న భారత విద్యార్థులు,  పౌరులను కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ’ పేరిట స్వదేశానికి తీసుకువచ్చింది. కొన్నిరోజుల పాటు జరిగిన ఈ ఆపరేషన్‌ కింద 20వేల మందికిపైగా సొంతప్రాంతాలకు చేరుకున్నారు. మరోపక్క గత ఏడాది నుంచి ఉక్రెయిన్‌, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. దాన్ని ఆపేందుకు  ప్రపంచ అగ్రనేతలు చేసిన మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ఫలితం చూపలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని