Lancet: క్యాన్సర్‌ కేసులు అబ్బాయిల్లోనే ఎక్కువ బయటపడుతున్నాయ్‌.. కారణం ఏంటీ..?

దేశంలో నమోదవుతోన్న క్యాన్సర్‌ కేసుల్లో అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిల సంఖ్యే ఎక్కువగా ఉంటోందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇందుకు సమాజంలోని బాలికలపై ఉన్న వివక్ష కూడా ఓ కారణం కావచ్చని అంచనా వేసింది. నిర్ధారణ కేంద్రాలు, చికిత్సకు బాలికలు దూరం కావడంతో.. వీరి సంఖ్య తక్కువగా ఉండవచ్చని అభిప్రాయపడింది.

Published : 30 Nov 2022 22:01 IST

దిల్లీ: భారత్‌లో అమ్మాయిల కంటే అబ్బాయిల్లోనే క్యాన్సర్‌ కేసులు ఎక్కువగా బయటపడుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. అయితే, ఇందుకు సమాజంలో లింగ వివక్ష ఓ కారణం కావచ్చని అంచనా వేసింది. లక్షణాలున్నప్పటికీ బాలికలను ఆసుపత్రులకు తీసుకువెళ్లకపోవడం కేసుల సంఖ్య తక్కువగా ఉండటానికి కారణమని అభిప్రాయపడింది. యువతలో క్యాన్సర్‌ కేసులు బయటపడుతున్న తీరుపై భారత పరిశోధకులు జరిగిన అధ్యయన నివేదిక ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ ది లాన్సెట్‌ ఆంకాలజీలో ప్రచురితమయ్యింది.

క్యాన్సర్‌ కేసులు నమోదవుతున్న తీరును తెలుసుకునేందుకు దిల్లీ ఎయిమ్స్‌తోపాటు చెన్నై క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ (WIA) పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. ఇందుకోసం దేశంలోని మూడు క్యాన్సర్‌ ఆసుపత్రుల్లోని బాధితుల రికార్డులను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా జనవరి 1, 2005 నుంచి డిసెంబర్‌ 31, 2019 వరకు ఉన్న సమాచారాన్ని విశ్లేషించారు. వీటిని మరో రెండు పాపులేషన్‌ బేస్‌డ్‌ క్యాన్సర్‌ రిజిస్ట్రీల (పీబీసీఆర్‌) సమాచారంతో పోల్చి చూశారు. ఆయా ఆసుపత్రుల్లో క్యాన్సర్‌ నిర్ధారణ, చికిత్స చేయించుకున్న పురుషులు, స్త్రీల నిష్పత్తిని అంచనా వేశారు. పీబీసీఆర్‌ల్లో నమోదైన 11వేల బాధితుల రికార్డులను పరిశీలించగా.. క్యాన్సర్‌ నిర్ధారణ చేయించుకున్న వారిలో పురుషులే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇక మూడు ఆసుపత్రుల్లో 22వేల క్యాన్సర్‌ చిన్నారుల రికార్డులను చూడగా.. వాటిలోనూ బాలురు ఎక్కువగా ఉన్నారని ఎయిమ్స్‌లోని క్యాన్సర్‌ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ సమీర్‌ బక్షీ వెల్లడించారు.

‘లక్షణాలున్నప్పటికీ వందల కి.మీ దూరం నుంచి రావడం, చికిత్సకు ఖర్చు ఎక్కువ అవుతుందనే భయంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన బాలికలు నిర్ధారణ పరీక్షకు దూరమవుతున్నారు. బాలికల కేసుల సంఖ్య తక్కువగా ఉండటానికి ఇదీ ఒక కారణం. దీంతో చికిత్స తీసుకునే అబ్బాయిల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దక్షిణ భారత్‌తో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో తక్కువ మంది బాలికలు క్యాన్సర్‌ చికిత్స తీసుకుంటున్నారు. ఖర్చు అధికంగా ఉండే ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకునే బాలికల సంఖ్య కూడా తక్కువగా ఉంటోంది. ఇదోరకంగా వివక్షే. ఇటువంటి సామాజిక, ఆర్థిక వివక్షను దూరం చేస్తే ఎక్కువ మందికి వ్యాధి నిర్ధారణ చేయవచ్చు’ అని ప్రొఫెసర్‌ సమీర్‌ బక్షీ వెల్లడించారు. అయితే, ఈ వివక్ష అనేది కేవలం వ్యాధి నిర్ధారణ వరకేనని.. చికిత్సలో మాత్రం ఎటువంటి వ్యత్యాసం ఉండదని స్పష్టం చేశారు. ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, వారి ఆలోచనా విధానంలో మార్పు తేవడం ద్వారా ఈ వివక్షను అధిగమించవచ్చని తాజా అధ్యయనం సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు