Gangster Arrested: దక్షిణాఫ్రికాలో ఎన్‌ఐఏకు చిక్కిన గ్యాంగ్‌స్టర్

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)  పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) గ్యాంగ్‌స్టర్‌ మహ్మద్ గౌస్ నియాజీని దక్షిణాఫ్రికాలో అరెస్టు చేసింది. 

Published : 02 Mar 2024 18:59 IST

దిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్‌ఐ) గ్యాంగ్‌స్టర్‌ మహ్మద్ గౌస్ నియాజీని దక్షిణాఫ్రికాలో అరెస్టు చేసింది.  నియాజీ 2016లో బెంగళూరులో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్ఎస్ఎస్) నేత రుద్రేష్‌ను హత్య చేశాడు. అప్పటినుంచి పోలీసులకు దొరకకుండా విదేశాలకు చెక్కేశాడు. అతడి కదలికలపై ఆరా తీస్తున్న గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) అతడు ఆశ్రయం పొందుతున్న లొకేషన్‌ను గుర్తించింది. దీనికి సంబంధించిన కీలక ఆధారాలను రుద్రేష్‌ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏకు తెలియజేసింది. దీంతో అప్రమత్తమైన ఎన్‌ఐఏ అధికారులు నిందితుడిని దక్షిణాఫ్రికాలో అరెస్టు చేశారు. అతడిని భారత్‌కు తీసుకురావడానికి అధికారిక చర్యలను వేగవంతం చేశారు. ఆర్‌ఎస్ఎస్ నాయకుడి హత్యలో నిందితుడిగా ఉన్నందున ముందుగా బెంగళూరులో విచారణకు తరలించనున్నారు.

కాగా 2016లో సంఘ్‌ కార్యక్రమానికి హాజరైన ఆర్‌ఎస్ఎస్ నేత రుద్రేష్‌ ఇంటికి తిరిగివెళ్తుండగా బెంగళూరులోని శివాజీనగర్‌లో దుండగులు ఆయనపై దాడి చేసి హత్య చేశారు. అనంతరం ఈ కేసును ప్రభుత్వం ఎన్‌ఐఏకు అప్పగించింది. దర్యాప్తులోభాగంగా ఇప్పటికే నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాక నియాజీని పట్టించినవారికి రూ.5 లక్షల రివార్డును  అప్పట్లో ఎన్‌ఐఏ ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని