ఆ తల్లి రోదనకు కరుణించని విధి.. 70 గంటలు శ్రమించినా దక్కని చిన్నారి ప్రాణం..!

మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని బోరుబావిలో(Borewell) పడిన చిన్నారిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. శనివారం ఉదయం చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు.

Updated : 10 Dec 2022 11:14 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని బెతుల్‌ జిల్లాలో నాలుగు రోజుల క్రితం బోరుబావి (Borewell)లో పడిన ఎనిమిదేళ్ల చిన్నారి కథ విషాదాంతమైంది. బాలుడిని రక్షించేందుకు 70 గంటలకు పైగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. శనివారం తెల్లవారుజామున చిన్నారి మృతదేహాన్ని వెలికితీసినట్లు అధికారులు తెలిపారు.

బెతుల్‌ జిల్లాలోని మాండవి గ్రామానికి చెందిన 8 ఏళ్ల తన్మయ్ మూడో తరగతి చదువుతున్నాడు. గత మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో పొలంలో ఆడుకుంటూ 400 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయాడు. తన్మయ్‌ బోరుబావిలో పడిపోయినప్పుడు అతడి అక్క చూసి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వెంటనే వారు పోలీసులను ఆశ్రయించారు.  సమాచారమందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు మొదలుపెట్టారు. 40 నుంచి 50 అడుగుల లోతులో చిక్కుకున్న చిన్నారిని బయటకు తీసేందుకు బోరుబావికి సమాంతరంగా సొరంగం తవ్వడం మొదలుపెట్టారు.

ఘటన జరిగిన గంట తర్వాత నుంచే సహాయక చర్యలు మొదలవ్వగా.. బాలుడిని రక్షించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు. బాలుడి ప్రాణాలకు ప్రమాదం రాకుండా బయటి నుంచి ఆక్సిజన్‌ పంపించారు కూడా. కానీ, అధికారుల ప్రయత్నాలు ఫలించలేదు. తన కొడుకును ప్రాణాలతో బయటకు తీసుకురావాలంటూ ఆ చిన్నారి తల్లి రోదనకు విధి కనికరించలేదు. శనివారం తెల్లవారుజామున బాలుడిని గుర్తించిన అధికారులు బోరుబావి నుంచి బయటకు తీసుకొచ్చారు. అయితే అప్పటికే చిన్నారి మరణించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో మాండవి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సీఎం దిగ్భ్రాంతి..

ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహన్‌ ట్విటర్‌ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక సిబ్బంది ఎంతగానో శ్రమించినా.. తన్మయ్‌ ప్రాణాలు దక్కకపోవడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ‘‘ఈ దుఃఖ సమయంలో తన్మయ్‌ కుటుంబానికి యావత్ మధ్యప్రదేశ్ అండగా ఉంటుంది. బాధిత కుటుంబానికి రూ.4లక్షల ఆర్థిక సాయం అందజేస్తాం’’ అని సీఎం ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని