Minor Car Driving: యువకుడితో కలిసి లగ్జరీ కారుతో ‘మైనర్‌’ వీరంగం.. తండ్రి అరెస్ట్‌!

లగ్జరీ కారు డ్రైవ్‌ చేసిన ఓ మైనర్‌ ముంబయి వీధుల్లో హల్‌చల్‌ సృష్టించాడు. మైనర్ వాహనం నడుపుతుండగా.. మరో యువకుడు బానెట్‌పై కూర్చున్నాడు. దీంతో ఆ బాలుడి తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. 

Published : 28 May 2024 00:04 IST

ముంబయి: మైనర్ల చేతికి వాహనాలు (Minor Car Driving) ఇవ్వడం వల్ల జరిగే దారుణ ప్రమాదాలను చూస్తూనే ఉన్నాం. మహారాష్ట్రలో ఇటీవల ఓ మైనర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌.. రెండు నిండు ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అయినా.. ఇంకా కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ముంబయిలో ఈ తరహా ఘటనే చోటుచేసుకొంది. ఒక మైనర్‌ బాలుడు లగ్జరీ కారు నడుపుతుండగా.. మరో వ్యక్తి వాహనం ముందు భాగంపై (బానెట్‌పై) కూర్చున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

ముంబయి రద్దీ ప్రాంతాల్లో ఒకటైన శివాజీ చౌక్‌ వద్ద ఓ మైనర్‌ బీఎమ్‌డబ్ల్యూ కారు నడిపాడు. అతడు డ్రైవింగ్‌ చేస్తుండగా.. సుభమ్‌ మితాలియా అనే మరో యువకుడు దర్జాగా కారు బానెట్‌పై కూర్చుని వీడియోకు ఫోజులిచ్చాడు. వీరి వ్యవహారం చూసి అక్కడున్నవారంతా భయభ్రాంతులకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  దీనిపై స్పందించిన పోలీసులు.. బాలుడి తండ్రిని అరెస్టు చేశారు. అతడితో పాటు వీడియోలో కనిపించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిర్లక్ష్య డ్రైవింగ్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నిందితుడి బ్లడ్‌ టెస్ట్‌ రిపోర్ట్‌నే మార్చేసిన ఫోరెన్సిక్‌ వైద్యులు: పుణె కారు యాక్సిడెంట్‌ కేసులో ట్విస్ట్‌

ఇదిలాఉండగా.. ఇటీవల పుణెలో ఓ మైనర్‌ నిర్లక్ష్య డ్రైవింగ్‌ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బాలుడు ప్రమాదానికి ముందు స్నేహితులతో కలిసి బార్‌కి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని మరిచిపోకముందే మరో బాలుడు చేసిన వీరంగంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎన్ని ఘోరాలు జరుగుతున్నా.. మైనర్లకు వాహనాలు అప్పజెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని