Salman Khan: సల్మాన్‌ ఇంటిపై కాల్పులు: విదేశాల్లో కుట్ర.. ముంబయిలో అమలు

బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఇంటిపై కాల్పుల ఘటనకు విదేశాల్లో కుట్ర జరిగినట్లు బలంగా అనుమానిస్తున్నారు. దీనికి ఓ స్థానిక గ్యాంగ్‌స్టర్‌ సహకరించినట్లు తెలుస్తోంది. తాజాగా నిందితుల అరెస్టుతో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 

Published : 16 Apr 2024 16:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) ఇంటిపై కాల్పుల ఘటనలో దర్యాప్తు వేగవంతమైంది. తాజాగా గుజరాత్‌లోని భుజ్‌ జిల్లాలో షూటర్లు వికాస్‌ గుప్తా (24), సాగర్‌ పాల్ (21)లను అరెస్టు చేశారు. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠాతో సంబంధాలున్నట్లు నిందితులు అంగీకరించారు. తాజాగా న్యాయస్థానం ఈ ఇద్దరు నిందితులను 10 రోజుల పోలీసు కస్టడీకి ఇచ్చింది.  

తుపాకులు ఏమయ్యాయి..?

బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లో ఖాన్‌ ఇంటి బాల్కనీలోకి వీరిద్దరూ గుడ్డిగా ఐదు రౌండ్లు కాల్చారు. ఆ సమయంలో సల్మాన్‌ ఇంట్లోనే ఉన్నారు. నిందితులిద్దరూ దాడికి ముందు ఆ ఇంటి వద్ద మూడుసార్లు రెక్కీ నిర్వహించినట్లు అధికారులు చెబుతున్నారు. కాల్పుల అనంతరం నిందితులు తుపాకులను సూరత్‌లోని ఓ నదిలో పడేసినట్లు తేలింది. డబ్బుల కోసమే వీరు ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు.

రంగంలోకి ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ దయానాయక్‌..!

సల్మాన్‌ ఇంటిపై దాడి ఘటనను ముంబయి క్రైం బ్రాంచ్‌ తీవ్రంగా పరిగణించింది. జాయింట్‌ కమిషనర్‌ (క్రైంబ్రాంచ్‌) లక్ష్మీ గౌతమ్‌, ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు ఇన్‌స్పెక్టర్‌ దయానాయక్‌లు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. వారు నిన్న సల్మాన్‌ ఇంటికి స్వయంగా వెళ్లి వివరాలు సేకరించారు. ఈ క్రమంలో పలు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. మొత్తం 15 బృందాలను ఏర్పాటుచేశారు. చివరికి నిందితులు గుజరాత్‌లోని భుజ్‌ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. దయానాయక్‌ నేతృత్వంలోని క్రైం బ్రాంచ్‌ ‘యూనిట్‌ 9’ బృందం వికాస్‌గుప్తా, సాగర్‌పాల్‌ను అదుపులోకి తీసుకొంది. ముంబయిలో మాఫియాను అణగదొక్కిన పోలీసుగా దయానాయక్‌ పేరు సుపరిచితమే.

ఈ కుట్రకు కెనడాలో మూలాలు..?

కాల్పుల తర్వాత లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడు అన్మోల్‌ చేసిన ఫేస్‌బుక్‌ పోస్టును దర్యాప్తు బృందాలు విశ్లేషించాయి. ఐపీ అడ్రస్‌ ఆధారంగా శోధించగా.. కెనడా నుంచి ఆ పోస్టు చేసినట్లు తేలింది. ‘సల్మాన్‌ ఖాన్‌.. నీకు ట్రైలర్‌ మాత్రమే చూపించాం. మా సామర్థ్యం నీకు అర్థమయ్యే ఉంటుంది. ఇదే నీకు చివరి వార్నింగ్‌’’ అని దానిలో హెచ్చరించిన విషయం తెలిసిందే. నిందితులు దర్యాప్తు బృందాలను తప్పుదోవ పట్టించేందుకు వీపీఎన్‌ వాడి ఆ పోస్టును సృష్టించే అవకాశం లేకపోలేదని అనుమానిస్తున్నారు. ఇక బిష్ణోయ్‌ గ్యాంగ్‌ తమ సభ్యులకు వేగంగా సరఫరా చేయడానికి వీలుగా వేర్వేరు రాష్ట్రాల్లో ఆయుధ నిల్వలను ఏర్పాటుచేసుకొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో నిందితులకు రోహిత్‌ గోదార అనే గ్యాంగ్‌స్టర్‌ మనుషుల ద్వారా ఆయుధాలు, బైకు అంది ఉండొచ్చని భావిస్తున్నారు.  

ఆ బాల్కనీ నుంచే అభిమానులకు అభివాదం..

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అయిన సల్మాన్‌కు గెలాక్సీ అపార్ట్‌మెంట్‌తో విడదీయలేని అనుబంధం ఉంది. సంపన్నుడైన ఈ కండల వీరుడు అక్కడ సింగిల్‌ బెడ్రూమ్‌ అపార్ట్‌మెంట్‌లో ఉంటాడు. దానికి ఉన్న బాల్కనీ నుంచే అభిమానులకు తరచూ అభివాదం చేస్తుంటాడు. అతడి సోదరులు, సోదరిల పిల్లలు తరచూ ఆడుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. ‘‘విలాసవంతమైన భవనాల కంటే బాంద్రా అపార్ట్‌మెంట్‌లో ఉండటమే నాకిష్టం’’ అని కొన్నాళ్ల క్రితం ఖాన్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.  

అది తప్పుడు ప్రచారం : అర్బాజ్‌ ఖాన్‌

సల్మాన్‌ ఇంటిపై కాల్పుల ఘటన తర్వాత తొలిసారి ఆయన కుటుంబసభ్యులు స్పందించారు. సోదరుడు అర్బాజ్‌ సోషల్‌మీడియాలో ఓ పోస్టు పెట్టారు. కాల్పుల ఘటన తమ కుటుంబాన్ని కలచి వేసిందన్నారు. మా ఫ్యామిలీకి సన్నిహితులమంటూ కొందరు మీడియాలో చౌకబారు ప్రకటనలు చేస్తున్నారన్నారు. అదంతా ఓ పబ్లిసిటీ స్టంట్‌గా అభివర్ణించారు. తమ కుటుంబసభ్యులు ఎవరూ ఈ ఘటనపై ప్రకటనలు చేయలేదన్నారు. ఇప్పుడు దర్యాప్తులో పోలీసులకు సహకరిస్తున్నామన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని