Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ ఇంటి వద్ద కాల్పులు.. ఇద్దరు నిందితుల అరెస్ట్‌

Salman Khan: సల్మాన్‌ఖాన్‌ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. వారిని తాజాగా ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Published : 16 Apr 2024 07:41 IST

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) బాంద్రా నివాసం వద్ద కాల్పులు జరిపిన కేసులో ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల అనంతరం ముంబయి నుంచి పరారైన వారు గుజరాత్‌లోని భుజ్‌లో చిక్కినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. సోమవారం రాత్రి వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారిని ముంబయికి తీసుకొచ్చి విచారిస్తామని పేర్కొన్నారు.

ఈ నిందితులు నవీ ముంబయి పన్వెల్‌లోని హరిగ్రామ్‌ ప్రాంతంలో నెల రోజులుగా అద్దె ఇంట్లో మకాం వేసినట్లు సోమవారం ఓ అధికారి తెలిపిన విషయం తెలిసిందే. సల్మాన్‌కు (Salman Khan) పన్వెల్‌లోనే ఫాంహౌస్‌ ఉంది. మరోవైపు, కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సోమవారం ముగ్గురు వ్యక్తులను విచారించారు. వీరిలో నిందితులకు ఇంటిని అద్దెకు ఇచ్చిన యజమాని, నిందితులు ఉపయోగించిన ద్విచక్ర వాహనం పూర్వ యజమాని, మోటారు సైకిల్‌ను విక్రయించడంలో సహకరించిన ఏజెంట్‌ ఉన్నారు. వీరితోపాటు మరికొందరిని సైతం ప్రశ్నించారు. ద్విచక్ర వాహనం పూర్వ యజమానిది కూడా పన్వెల్‌ అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. 

ఆదివారం ఉదయం ఐదు గంటల సమయంలో బాంద్రా ప్రాంతంలో సల్మాన్‌ ఉండే గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌ వద్దకు మోటారు సైకిల్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని