Sunita Kejriwal: ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్‌ రేపు కోర్టులో చెబుతారు: సతీమణి సంచలన ప్రకటన

Sunita Kejriwal: దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టుపై ఆయన సతీమణి సునీత మరో వీడియో సందేశం విడుదల చేశారు. ఈ కేసుకు సంబంధించి నిజాలన్నీ ఆయన గురువారం కోర్టులో బయటపెడతారని చెప్పారు.

Updated : 27 Mar 2024 12:50 IST

దిల్లీ: మద్యం విధానానికి (Delhi Excise Scam Case) సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో తన అరెస్టును సవాల్‌ చేస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సమయంలో ఆయన సతీమణి సునీత (Sunita Kejriwal) సంచలన ప్రకటన చేశారు. లిక్కర్‌ స్కామ్‌లో నిజానిజాలను తన భర్త గురువారం (మార్చి 28) కోర్టులో బయటపెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు నేడు ఆమె వీడియో సందేశం విడుదల చేశారు.

‘‘నా భర్తను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఆయనకు ఆరోగ్యం సరిగా లేదు. డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. కస్టడీలోనూ ఆయన ప్రజల గురించే ఆలోచిస్తున్నారు. అక్కడి నుంచే నీటి సమస్యను నివారించాలని రెండు రోజుల క్రితం మంత్రి ఆతిశీకి లేఖ పంపారు. దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సమస్యగా మారుస్తోంది. ఆయనపై కేసులు పెడుతోంది. దిల్లీని నాశనం చేయాలని వారు (కేంద్రం) కోరుకుంటున్నారు. ఈ పరిణామాలతో ఆయన ఆందోళనకు గురవుతున్నారు’’ అని సునీత ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘మద్యం కేసుకు సంబంధించి ఈడీ ఇప్పటివరకు 250 సార్లకు పైగా సోదాలు జరిపింది. ఎందులోనూ వారికి ఏమీ దొరకలేదు. ఈ కేసుకు సంబంధించి రేపు (మార్చి 28) కోర్టులో అన్ని నిజాలు బయటపెడతానని అరవింద్‌ కేజ్రీవాల్‌ చెప్పారు. లిక్కర్‌ స్కామ్‌ డబ్బు ఎక్కడుందో ఆయన న్యాయస్థానంలో చెబుతారు. అందుకు తగిన ఆధారాలు కూడా ఇస్తారు’’ అని సీఎం సతీమణి వెల్లడించారు. కేజ్రీవాల్‌ నిజమైన దేశభక్తుడని, ధైర్యం గల నేత అని తెలిపారు.

కేజ్రీవాల్‌ పిటిషన్‌పై విచారణ..

ఇదిలా ఉండగా.. మద్యం కేసులో తన అరెస్టును వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్‌ దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. ‘‘ఎన్నికల ముందు ఆప్‌ను విచ్ఛిన్నం చేసేందుకు, రాజకీయంగా బలహీనపర్చేందుకే కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఎలాంటి విచారణ లేకుండానే ఆయనను కస్టడీలోకి తీసుకుంది. విచారణకు సహకరించడం లేదని ఈడీ చెప్పడం ఉత్తమాటే. ఇందులో ఆయనను అరెస్టు చేయాల్సిన అవసరం లేదు. తక్షణమే విడుదల చేయాలి’’ అని సీఎం తరఫు న్యాయవాది కోర్టును కోరారు. మరోవైపు, ఆయన పిటిషన్‌పై స్పందించేందుకు తమకు మరింత సమయం కావాలని ఈడీ అభ్యర్థించింది. దీనిపై వాదనలు కొనసాగుతున్నాయి.

ఆందోళనకు లాయర్ల పిలుపు.. హైకోర్టు ఆగ్రహం

మరోవైపు కేజ్రీవాల్‌ అరెస్టును నిరసిస్తూ ఆప్‌ లీగల్‌ సెల్‌ కోర్టు ప్రాంగణాల్లో ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీనిపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ అంశంపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘కోర్టుల్లో నిరసనలు చేపడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. న్యాయస్థానాల కార్యకలాపాలను ఆపకూడదు. అలా ఎవరైనా చేస్తే అది ప్రమాదకర చర్యే. ఈ అంశంపై గురువారం విచారణ చేపడుతాం’’ అని కోర్టు వెల్లడించింది.

ఈ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన కస్టడీ రేపటితో (మార్చి 28) ముగియనుంది. గురువారం దర్యాప్తు అధికారులు ఆయనను కోర్టులో హాజరుపర్చనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని