Rajeev Chandrasekhar: ఆ కారణంగానే నా ఆదాయం తగ్గింది: రాజీవ్‌ చంద్రశేఖర్‌

అఫిడవిట్‌పై చెలరేగిన వివాదంపై  కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ వివరణ ఇచ్చారు. దీనిపై ఎక్స్‌ వేదికగా స్పందించారు.

Published : 12 Apr 2024 00:05 IST

Rajeev Chandrasekhar | తిరువనంతపురం: తన అఫిడవిట్‌పై రేగిన వివాదంపై కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ (Rajeev Chandrasekhar) స్పందించారు. కొవిడ్‌ కారణంగా తలెత్తిన నష్టాల వల్లే 2021-22 ఆర్థికసంవత్సరంలో పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం భారీగా తగ్గిందని పేర్కొన్నారు. కావాలనే కొందరు పనిగట్టుకుని వివాదం చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

కేరళలోని తిరువనంతపురంలో కాంగ్రెస్‌ అభ్యర్థి శశిథరూర్‌పై కేంద్ర మంత్రి రాజీవ్‌ భాజపా తరఫున చంద్రశేఖర్‌ బరిలో నిలిచారు. ఇటీవల ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా 2021-2022లో పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం కేవలం రూ.680 మాత్రమేనని అఫిడవిట్‌ సమర్పించారు. ఈ లెక్కలపై కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. కేంద్రమంత్రి ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ఆర్థిక సమాచారం అందించారని ఆరోపించింది. ఇది 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టం ఉల్లంఘనగా అభివర్ణించింది.

తమకు అందించిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం అఫిడవిట్‌ను పరిశీలించాలని సీబీడీటీని ఆదేశించిన నేపథ్యంలో దీనిపై తాజాగా ఎక్స్‌ వేదికగా రాజీవ్‌ చంద్రశేఖర్‌ వివరణ ఇచ్చారు. తాను కొన్నేళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నానని, ఎంపీగా/ మంత్రిగా వచ్చే జీతభత్యాలు, ప్రయోజనాలతో పాటు పొదుపు/పెట్టుబడులపై వచ్చే వడ్డీ, డివిడెండ్లే తనకు ప్రధాన ఆదాయం వనరు అని తెలిపారు. కొవిడ్‌ సమయంలో తాను భాగస్వామిగా ఉన్న వ్యాపారంలో భారీ నష్టాలు రావడం వల్ల పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం తగ్గిందని పేర్కొన్నారు. అభివృద్ధి, ఉద్యోగాలు, నైపుణ్య శిక్షణ వంటి అంశాల నుంచి ఓటర్లను దృష్టి మరల్చేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలు పనిచేయవని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు