Loksabha Elections: ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌.. లోక్‌సభ ఎన్నికలకు ‘ఈఎన్‌పీవో’ బాయ్‌ కాట్‌!

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాటం చేస్తున్న ది ఈస్ట్రన్‌ నాగాలాండ్‌ పీపుల్స్‌ ఆర్గనైజేషన్ నాగాలాండ్‌లో లోక్‌సభ ఎన్నికలను బాయ్‌కాట్‌ చేయాలని నిర్ణయించింది.

Published : 30 Mar 2024 20:01 IST

కోహిమా: నాగాలాండ్‌లోని ఆరు జిల్లాలతో ఓ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేస్తున్న ‘ది ఈస్ట్రన్‌ నాగాలాండ్‌ పీపుల్స్‌ ఆర్గనైజేషన్’ (ENPO) లోక్‌సభ ఎన్నికలను బాయ్‌కాట్‌ చేయాలని నిర్ణయించింది. కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ్చేంతవరకు రాష్ట్రంలోని ఏకైక లోక్‌సభ స్థానంలో ఎన్నికలకు సహకరించబోమని స్పష్టం చేసింది. నాగాలాండ్‌ తూర్పు ప్రాంతానికి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు, వివిధ సంస్థలకు చెందిన ప్రముఖులతో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం గత కొన్నాళ్లుగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మార్చి 8 నుంచి కేంద్రం అక్కడ ‘పబ్లిక్‌ ఎమర్జెన్సీ’ విధించింది. ఇది నాగాజాతికి చెందిన ఏడు గిరిజన తెగలకు నేతృత్వం వహిస్తున్న ‘ఈఎన్‌పీవో’ ఎన్నికల ప్రచారానికి అడ్డంకిగా మారింది. ఈనేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఫిబ్రవరిలో జరిగిన నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికలను కూడా బహిష్కరించాలని ఈఎన్‌పీవో పిలుపునిచ్చింది. అయితే, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) హామీ మేరకు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

ఈఎన్‌పీవో డిమాండ్‌ మేరకు కేంద్ర హోంశాఖ గతేడాది ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేసింది. ఈ బృందం పలుమార్లు ఆయా ప్రాంతాల్లో పర్యటించి ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంది. మరోవైపు తూర్పు నాగాలాండ్‌ ప్రాంత ప్రజల కోసం స్వతంత్ర వ్యవస్థను రూపొందించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి సిఫారసు చేసిందని ముఖ్యమంత్రి నెఫ్యూ రియో కూడా ఇటీవల వెల్లడించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని