Sita and Akbar: ఆ సింహాల పేర్లను మార్చండి : బెంగాల్‌ ప్రభుత్వానికి హైకోర్టు సూచన

ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచిన రెండు సింహాల (Sita and Akbar) పేర్లను మార్చడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కలకత్తా హైకోర్టు మౌఖికంగా సూచించింది.

Published : 22 Feb 2024 21:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పశ్చిమ బెంగాల్‌లోని శిలిగుడి సఫారీ (Bengal Safari) పార్కులో అక్బర్‌, సీత పేర్లు కలిగిన మగ, ఆడ సింహాలను ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచడం వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం ఇప్పటికే కలకత్తా హైకోర్టు (Calcutta High Court)కు చేరుకోగా.. జల్‌పాయీగుడీ సర్క్యూట్‌ బెంచ్‌ ఆ పిటిషన్‌ను విచారించింది. ఈసందర్భంగా రెండు సింహాల పేర్లను మార్చడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి మౌఖికంగా సూచించింది.

త్రిపురలోని సిపాహీజలా జులాజికల్‌ పార్క్‌ నుంచి బెంగాల్‌ అధికారులు ‘అక్బర్‌’, ‘సీత’ పేర్లు కలిగిన మగ, ఆడ సింహాలను శిలిగుడి సఫారీ పార్కుకు ఇటీవల తీసుకొచ్చారు. అనంతరం వాటిని ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. దీంతో రాష్ట్ర అటవీశాఖ అధికారులే సింహాలకు ఆ పేర్లు పెట్టారని.. అవి హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని విశ్వహిందూ పరిషత్‌ (VHP) ఆరోపించింది. వెంటనే ఆడ సింహం పేరు మార్చాలని డిమాండ్‌ చేయడంతోపాటు కోర్టును ఆశ్రయించింది.

దీనిపై తాజాగా విచారణ జరిపిన జస్టిస్‌ సౌగతా భట్టాచార్య ఏకసభ్య ధర్మాసనం.. ఈ వివాదానికి తెరదించాలని పేర్కొంది. ఇందుకోసం సింహాల పేర్లను మార్చడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి మౌఖిక ఆదేశాలిచ్చింది. పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం తరఫున హాజరైన ఏఏజీ వాదనలు వినిపిస్తూ.. ఆ పేర్లను త్రిపురలో పెట్టారని, వాటి పేర్లను మార్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే యోచిస్తోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని