భద్రత లేకుండా.. బెంగళూరు వీధుల్లో యూకే ప్రథమ మహిళ

ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి(Narayana Murthy) కుటుంబం మరోసారి తమ నిరాడంబరతతో ఆకట్టుకుంది. 

Updated : 27 Feb 2024 10:56 IST

లండన్‌: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి (Narayana Murthy) కుటుంబం బెంగళూరు వీధుల్లో పర్యటించింది. ఆయన తన సతీమణి సుధామూర్తి(Sudha Murty), కుమార్తె, యూకే ప్రథమ మహిళ అక్షతా మూర్తి(Akshata Murty), మనవరాళ్లతో కలిసి రాఘవేంద్ర మఠ్‌కు వెళ్లారు. సామాన్య ప్రజల వలే రోడ్డుపై దుకాణాల వెంట తిరుగుతూ మార్కెట్లోకి కొత్తగా వచ్చిన పుస్తకాలను పరిశీలించారు. ఆ సమయంలో వారి దగ్గర్లో ఎలాంటి భద్రతా లేకపోవడం గమనార్హం. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

ఈ వీడియో సరిగ్గా ఎప్పుడు తీశారో స్పష్టత లేనప్పటికీ.. వారి నిరాడంబరతకు మరోసారి ప్రశంసలు కురుస్తున్నాయి. ఇటీవల ఇలాంటి దృశ్యమే ఒకటి వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని ఒక పాపులర్ ప్లేస్‌లో ఐస్‌క్రీమ్‌ను ఆస్వాదిస్తూ ఈ తండ్రీకుమార్తె కనిపించారు. నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చారు.

అలాగే ఇటీవల అక్షత ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ‘యాన్‌ అన్‌కామన్ లవ్‌: ది ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణ మూర్తి’ పేరిట చిత్రా బెనర్జీ అనే రచయిత ఆ పుస్తకాన్ని రచించారు. గత ఏడాది జరిగిన జీ20 శిఖరాగ్రసదస్సులో భాగంగా తన భర్త, యూకే పీఎం రిషి సునాక్‌తో కలిసి అక్షత మనదేశంలో పర్యటించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని