Modi: ముచ్చటగా మూడోసారి.. నరేంద్రమోదీ అనే నేను

భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం చేశారు.

Updated : 09 Jun 2024 21:48 IST

దిల్లీ: భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. 2014లో మోదీ తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2019లోనూ విజయం సాధించి తిరుగులేని నేతగా ఎదిగారు. 2024 ఎన్నికల్లోనూ ఎన్డీయేకు 293 స్థానాలు దక్కడంతో మళ్లీ ప్రధానిగా పగ్గాలు చేపట్టే అవకాశం లభించింది. ఈసారి ఐదుగురు తెలుగు ఎంపీలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దాదాపు 8వేల మంది  దేశ, విదేశీ ప్రముఖులతో పాటు సార్క్‌ సభ్య దేశాల నేతలు హాజరయ్యారు. సుప్రీంకోర్టు సీజే జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెదేపా అధినేత చంద్రబాబు, జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, సినీనటులు షారుక్‌ ఖాన్‌, రజనీకాంత్‌తో పాటు ఆధ్యాత్మికవేత్త చినజీయర్‌ స్వామి, పలు పీఠాలకు చెందిన అధిపతులు తరలివచ్చారు.

మూడోసారి ప్రమాణం.. వాజ్‌పేయీ సరసన మోదీ..

వరుసగా మూడో సార్వత్రిక ఎన్నికల్లోనూ భాజపాను విజయపథంలో నడిపించిన నరేంద్ర మోదీ.. తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తర్వాత అంతటి ఘనత సాధించిన నేతగా చరిత్ర సృష్టించారు. నెహ్రూ తర్వాత ఏ ప్రధానీ వరుసగా మూడుసార్లు తమ సారథ్యంలోని పార్టీలను ఈ స్థాయిలో గెలిపించిన దాఖలాల్లేవు. 1950 సెప్టెంబరు 17న గుజరాత్‌లోని పేద కుటుంబంలో జన్మించిన మోదీ.. రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ 2001లో తొలిసారి గుజరాత్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు.

తనదైన నాయకత్వ పటిమతో వరుసగా 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కమలం పార్టీకి సంపూర్ణ మెజార్టీ సాధించిపెట్టారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ‘మోదీ గ్యారంటీ’ పేరుతో గెలుపు బాధ్యతలను తన భుజస్కంధాల మీద వేసుకుని.. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని విజయతీరాలకు చేర్చారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ అనంతరం మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండో కాంగ్రెసేతర నేత మోదీనే. అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన మొదటి కాంగ్రెసేతర నాయకుడిగానూ రికార్డు సృష్టించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని