Narendra Modi: మోదీ.. మూడోసారి పట్టాభిషేకం

దేశ ప్రధానిగా నరేంద్ర దామోదర్‌దాస్‌ మోదీ ఆదివారం సాయంత్రం ప్రమాణం చేశారు. 2014, 2019 ఎన్నికల్లో విజయం తర్వాత రెండుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. తాజా ఎన్నికల్లో కూటమి గెలుపుతో వరసగా మూడోసారి పీఠమెక్కిన ఘనత సాధించారు.

Updated : 10 Jun 2024 07:16 IST

ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము
71 మంది మంత్రులతో కొలువుదీరిన సర్కారు
అమిత్‌షా, రాజ్‌నాథ్, గడ్కరీ, నిర్మల, జైశంకర్‌లకు మళ్లీ ఛాన్స్‌
తెలంగాణ తరఫున కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు చోటు
ఏపీ నుంచి రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని, శ్రీనివాసవర్మ
ఈనాడు - దిల్లీ

రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీతో ప్రమాణం చేయిస్తున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

దేశ ప్రధానిగా నరేంద్ర దామోదర్‌దాస్‌ మోదీ ఆదివారం సాయంత్రం ప్రమాణం చేశారు. 2014, 2019 ఎన్నికల్లో విజయం తర్వాత రెండుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. తాజా ఎన్నికల్లో కూటమి గెలుపుతో వరసగా మూడోసారి పీఠమెక్కిన ఘనత సాధించారు. రాష్ట్రపతి భవన్‌లో ఆహ్లాదభరిత వాతావరణంలో అట్టహాసంగా జరిగిన వేడుకలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఏడు దేశాల అధినేతలు, భారత మాజీ రాష్ట్రపతులు, వివిధ రంగాల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సినీతారలు, మత గురువులు, పారిశుద్ధ్య కార్మికులు, వందేభారత్‌ లోకోపైలట్లు సహా సమాజంలో వివిధ వర్గాలవారి సమక్షంలో ఈ కార్యక్రమం పూర్తయింది. ఇదివరకు ఎన్నడూలేని రీతిలో దాదాపు 9 వేల మంది ఆహ్వానితులు దీనికి హాజరయ్యారు. జవహర్‌లాల్‌ నెహ్రూ తర్వాత దేశంలో వరసగా మూడోసారి ప్రధాని అయిన ఘనతను 73 ఏళ్ల మోదీ సాధించారు. 

ఐదేళ్ల తర్వాత మళ్లీ నడ్డాకు బెర్తు

ప్రధాని తర్వాత ప్రమాణం పూర్తిచేసిన 71 మంది కేంద్రమంత్రుల్లో 30 మందికి క్యాబినెట్‌ హోదా ఉంటుంది. ఐదుగురు స్వతంత్ర హోదాలో ఉంటారు. మిగిలిన 36 మంది సహాయ మంత్రులు. ఈసారి ఐదుగురు తెలుగువారికి మంత్రిమండలిలో చోటు దక్కింది. భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డాను ఐదేళ్ల విరామం తర్వాత తిరిగి క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్‌సింగ్‌ చౌహాన్, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌లకు కొత్తగా చోటు దక్కింది. గతంలో రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈసారి లోక్‌సభ బరిలో దిగి విజయం చేజిక్కించుకున్న భాజపా నేతలు పీయూష్‌ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, ధర్మేంద్ర ప్రధాన్, భూపేందర్‌ యాదవ్‌లకు మంత్రి పదవులు లభించాయి. అస్సాం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, అశ్వినీ వైష్ణవ్, వీరేంద్రకుమార్, ప్రహ్లాద్‌ జోషి, గిరిరాజ్‌ సింగ్, జుయెల్‌ ఓరంలు భాజపా తరఫున మంత్రులుగా ప్రమాణం చేసినవారిలో ఉన్నారు. 

ఐదు మిత్ర పక్షాలకు ఒక్కో క్యాబినెట్‌ పదవి

ఎన్డీయే మిత్రపక్షాల తరఫున మంత్రులైన తెలుగువారిలో తెదేపా నుంచి కె.రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌; భాజపా నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ, జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ ఉన్నారు. వీరితో పాటు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల తరఫున హెచ్‌.డి.కుమారస్వామి (జేడీఎస్‌), చిరాగ్‌ పాస్వాన్‌ (ఎల్‌జేపీ-ఆర్‌వీ), జితన్‌రామ్‌ మాంఝీ (హెచ్‌ఏఎం-సెక్యులర్‌), రాజీవ్‌రంజన్‌ సింగ్‌ ‘లలన్‌’ (జేడీయూ) తదితరులు ఉన్నారు. ఐదు మిత్ర పక్షాలకు ఒక్కో క్యాబినెట్‌ బెర్తు చొప్పున ఇచ్చారు. ప్రమాణానికి ముందు మంత్రులతో మోదీ మాట్లాడి, ప్రభుత్వంలో వ్యవహరించాల్సిన విధానంపై కొన్ని సూచనలు చేశారు. వేడుకకు విపక్ష నేతలెవరూ హాజరు కాలేదు. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక్కరే ఇండియా కూటమి నుంచి హాజరయ్యారు. ఆ మేరకు కాంగ్రెస్‌ ఒక నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక దిగ్గజాలైన ముకేశ్‌ అంబానీ, అనంత్‌ అంబానీ, గౌతం అదానీ, ఆయన భార్య ప్రీతి అదానీ, ఆనంద్‌ పిరమాళ్‌ తదితరులు వేడుకకు హాజరయ్యారు. మాజీ రాష్ట్రపతులు రామ్‌నాథ్‌ కోవింద్, ప్రతిభా పాటిల్, మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, నటులు షారుక్‌ ఖాన్, అనుపమ్‌ఖేర్, అనిల్‌ కపూర్, అక్షయ్‌కుమార్, రవీనా టాండన్, రజనీకాంత్, ఎంపీగా ఎన్నికైన తార కంగనా రనౌత్‌; సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, పలువురు మతపెద్దలు కూడా వేడుకను ప్రత్యక్షంగా తిలకించారు. హాజరైన ప్రముఖుల్లో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, చినజీయర్‌ స్వామి ఉన్నారు. 

పాత, కొత్తల మేలు కలయిక 

మంత్రివర్గంలోకి 10 మంది కొత్తవారు చేరారు. అందులో ఏడుగురు మాజీ ముఖ్యమంత్రులు. తెలుగువారిలో కిషన్‌రెడ్డి, రామ్మోహన్‌నాయుడు క్యాబినెట్‌ మంత్రులు కాగా మిగిలిన ముగ్గురు సహాయమంత్రులు. 30 మంది క్యాబినెట్‌ మంత్రుల్లో 20 మంది పాతవారిని యథాతథంగా కొనసాగించారు. 10 మంది కొత్తవారికి స్థానం కల్పించారు. ఐదుగురు స్వతంత్ర హోదా సహాయ మంత్రుల్లో ముగ్గురు పాతవారు, ఇద్దరు కొత్తవారు. 36 మంది సహాయ మంత్రుల్లో 12 మంది పాతవారు, 24 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. మొత్తంగా 71 మందితో కొలువుదీరిన మంత్రిమండలిలో పాత (35), కొత్త (36) సగం సగం ఉన్నారు. రాత్రి 7.23 గంటలకు నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం 9.49 గంటలకు అస్సాం రాజ్యసభ సభ్యుడు పబిత్ర మార్గరీటా ప్రమాణంతో పూర్తయింది. క్యాబినెట్‌ మంత్రుల్లో ఇద్దరు, సహాయ మంత్రుల్లో ఐదుగురు కలిపి మొత్తం ఏడుగురు మహిళలకు అవకాశం కల్పించారు. ఏడుగురు ఎస్సీలు, ముగ్గురు ఎస్టీలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 14 మంది మంత్రులు ఇంగ్లిష్‌లో ప్రమాణం చేయగా, మిగిలినవారంతా హిందీలో చేశారు. ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వర్మ హిందీలో, మిగిలిన ఇద్దరు ఆంగ్లంలో.. తెలంగాణ మంత్రులిద్దరు హిందీలో ప్రమాణం చేశారు. 

లోక్‌సభ నుంచే ఎక్కువ ప్రాతినిధ్యం 

క్యాబినెట్‌ మంత్రులు 30 మందిలో 25 మంది లోక్‌సభకు, ఐదుగురు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్వతంత్ర హోదా మంత్రుల్లో ఐదుగురిలో నలుగురు లోక్‌సభ సభ్యులే. సహాయ మంత్రులు 36 మందిలో ఐదుగురు రాజ్యసభ, 29 మంది లోక్‌సభ సభ్యులున్నారు. ఇద్దరు మాత్రం ఏ సభలోనూ సభ్యులుగా లేరు. 81 మందికి అవకాశముండే కేంద్ర మంత్రివర్గంలోకి మోదీ ఒకేసారి 71 మందిని తీసుకున్నారు. ఈ అయిదేళ్లలో ఆర్థిక వ్యవస్థను వేగంగా పరుగులు తీయించి హామీలను అమలుచేయాల్సి ఉన్నందున ఆయన ఒకేసారి పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మూడింట రెండువంతుల మంది పాతవారికి అవకాశం ఇచ్చి.. సంకీర్ణ ధర్మం, ఇతరత్రా సర్దుబాట్ల దృష్ట్యా ఒక వంతు మందిని కొత్తవారికి తీసుకున్నారు. ఈసారి భాజపా ఎంపీల సంఖ్య ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి తగ్గడంతో క్యాబినెట్‌లోనూ ఆమేరకు కోతపెట్టారు. ఆ రాష్ట్రం నుంచి మోదీ, రాజ్‌నాథ్‌సింగ్‌లు మాత్రమే ఉన్నారు. అత్యధికంగా గుజరాత్, మధ్యప్రదేశ్, బిహార్‌ల నుంచి ముగ్గురేసి ఎంపీలకు క్యాబినెట్‌ హోదా దక్కింది. మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, రాజస్థాన్‌ల నుంచి ఇద్దరిద్దరికి, హరియాణా, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఝార్ఖండ్, అరుణాచల్‌ప్రదేశ్, పంజాబ్‌ల నుంచి ఒక్కొక్కరికి అవకాశం దొరికింది. స్వతంత్ర, సహాయమంత్రుల్లో మాత్రం ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి 8 మందికి స్థానం లభించింది.

కేంద్ర మంత్రులు అభివృద్ధికి కృషి చేయాలి: పొన్నం 

కరీంనగర్‌ పట్టణం, న్యూస్‌టుడే: కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులు విభజన చట్టంలోని అన్ని హామీలను నెరవేర్చి అభివృద్ధి కోసం కృషి చేయాలని రాష్ట్ర బీసీ, సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ కాంక్షించారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్‌కు పొన్నం శుభాకాంక్షలు తెలిపారు. గత తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రంతో సఖ్యత లేకపోవడంతో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని, ప్రస్తుత కేంద్ర మంత్రులు అన్ని రకాల నిధులు రాబడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

ప్రధాని, కేంద్ర మంత్రులకు కేటీఆర్, హరీశ్‌ శుభాకాంక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణం చేసిన నరేంద్రమోదీకి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులు ఆదివారం ‘ఎక్స్‌’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని, ఆయన సహచరులు దేశ ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ తమ పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవాలని కేటీఆర్‌ పేర్కొన్నారు. తాజాగా కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు హరీశ్‌రావు అభినందనలు తెలిపారు.


ప్రధానికి చంద్రబాబు అభినందనలు

ఈనాడు-అమరావతి: ప్రధానమంత్రి మోదీకి తెదేపా అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు శుభాకాంక్షలు చెప్పారు. నరేంద్రమోదీ లక్ష్యమైన వికసిత్‌ భారత్‌ సాధన దిశగా ఈ పదవీ కాలం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారికీ అభినందనలు చెప్పారు. దేశ వృద్ధి, అభివృద్ధి, సౌభాగ్యంలో కొత్త శకానికి ఈ ప్రమాణ స్వీకార వేడుక ఆరంభమని ఆదివారం ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. 


యువత, అనుభవజ్ఞుల కలబోత 

యువ ఎంపీలు, అనుభవజ్ఞుల కలబోతగా కొత్త మంత్రివర్గం ఉంది. ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో వారు ఏ ప్రయత్నాన్నీ విడిచిపెట్టరు. అభివృద్ధిలో దేశాన్ని సమున్నత ఎత్తులకు తీసుకువెళ్లడంలో, 140 కోట్ల మంది ప్రజలకు సేవలు అందించడంలో మంత్రిమండలితో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నా. మంత్రులకు అభినందనలు. 

ప్రధాని నరేంద్రమోదీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని