ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో యోగా విధానాలు, పరిశోధనపై జాతీయ సదస్సు

మానవాళికి ఆరోగ్యాన్ని అందించిన యోగాపై శాస్త్రీయ పరిశోధనలు, యోగా విధానాల అభివృద్ధి, యోగాను విశ్వవ్యాప్తం చేయడంతో పాటు పలు అంశాలపై 2వ జాతీయ సదస్సు కొనసాగుతోంది.

Published : 25 Feb 2024 17:54 IST

బెంగళూరు: మానవాళికి ఆరోగ్యాన్ని అందించిన యోగాపై శాస్త్రీయ పరిశోధనలు, యోగా విధానాల అభివృద్ధి, యోగాను విశ్వవ్యాప్తం చేయడంతో పాటు పలు అంశాలపై 2వ జాతీయ సదస్సు కొనసాగుతోంది. భారత యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో ఫిబ్రవరి 24-26 తేదీల్లో ఈ సదస్సు జరగనుంది.  దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల నుంచి యోగా బృందాలు, ప్రఖ్యాత యోగా పండితులు, పరిశోధకులు, అభ్యాసకులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయ యోగా అసోసియేషన్ ఛైర్‌పర్సన్‌, ప్రపంచ మానవతావాది, ఆధ్యాత్మికవేత్త, గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ప్రసంగించారు. ‘‘అనేక శతాబ్దాలుగా యోగా ఉన్నప్పటికీ, దాని శాస్త్రీయ వివరణ ప్రపంచం నలుమూలలకూ చేరవలసిన సమయం ఆసన్నమైంది. మన యోగా సంప్రదాయాల మౌలిక స్వరూపాన్ని, స్వచ్ఛతను మనం కాపాడుకోవాలి" అని పిలుపునిచ్చారు. 

‘‘జీవితంలో కాంటెక్ట్స్‌ (విశాల దృక్పథం), కంపాషన్ (దయార్ద్ర హృదయం), కమిట్ మెంట్ (నిబద్ధత) అనే మూడు ‘సి’ లను కలిగి ఉండటం ముఖ్యం. విశాల దృక్పథం కలిగి ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలపై మనసు అతిగా స్పందించడం మానేస్తుంది. తన పట్ల, ఇతరుల పట్ల దయ కలిగి ఉన్నప్పుడు చాలా సమస్యలు పరిష్కారమౌతాయి. వీటికి తోడుగా జీవితంపట్ల నిబద్ధతను కలిగి ఉడటం చాలా ముఖ్యం. యోగా మనకు ఈ మూడింటినీ ఇస్తుంది’’ అని  అని గురుదేవ్ తెలిపారు.  భిన్నత్వంలో ఏకత్వం అనే ఆలోచనే పునాదిగా 2006లో భారతీయ యోగా అసోసియేషన్ భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన యోగాలోని వైవిధ్య విధానాలను, సుసంపన్నమైన, విభిన్నమైన సాంస్కృతిక వారసత్వాలను, సంప్రదాయాలను అనుసంధానం చేయడం, సేకరించడం, ఒకచోట చేర్చడం వంటి పనులను చేపడుతోంది.  భారతీయ యోగా అసోసియేషన్ అధ్యక్షులు, రచయిత, పరిశోధకుడు ప్రాచీన యోగా పాఠశాలల్లో ఒకటైన యోగా ఇన్‌స్టిట్యూట్ (ముంబయి) డైరెక్టర్ మా హంస మాట్లాడుతూ..  3-హెచ్ గురించి వివరించారు. ‘మొదటి హెచ్ (హార్డ్) కష్టపడి పని చేయండి. చేసిన పనిని, జీవితంతో సమన్వయం చేసుకోవాలి.  రెండవ హెచ్ (హెడ్)- తల లేదా మనస్సు సరిగ్గా ఉండాలి. ప్రతిదాన్ని సానుకూల దృక్పథంతో చూడండి. మూడో హెచ్ (హార్ట్) మనసు - ఇది చేతులతో (చేసే పనితో), చేయించే బుద్ధితో కలిసి పనిచేయాలి. మీరు సంపూర్ణమైన వ్యక్తులుగా జీవించాలి’’ అన్నారు. 

మానసిక ప్రశాంతత లేకుండా ప్రపంచ శాంతి సాధించడం ఎందుకు అసాధ్యమనే అంశంపై ఆచార్య లోకేష్ ముని మాట్లాడారు. భారతదేశపు అద్భుతమైన యోగ సంస్కృతి గురించి డాక్టర్ బసవారెడ్డి తన అభిప్రాయాలను పంచుకుంటూ, భౌతిక, మానసిక ప్రపంచాలను ఏకం చేసే జ్ఞానాన్ని ఇస్తూ క్రమంగా ప్రకృతిని, విశ్వాన్నంతటినీ యోగా ఏకం చేయగలదని అన్నారు.

ఈ సదస్సు ప్రారంభోత్సవానికి హాజరైన ప్రముఖులు వీరే..

పద్మశ్రీ డాక్టర్ హెచ్‌ఆర్ నాగేంద్ర, భారతీయ యోగా అసోసియేషన్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు; డాక్టర్ బసవారెడ్డి- మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా, మాజీ డైరెక్టర్; అహింసా విశ్వ భారతి వ్యవస్థాపకుడు ఆచార్య లోకేష్ ముని; స్వామి ఆత్మప్రియానంద్, భారతీయ యోగా అసోసియేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్; సుబోధ్ తివారీ- కైవల్యధామ్ సీఈవో; మా హంస- భారతీయ యోగా అసోసియేషన్ అధ్యక్షులు; డాక్టర్ ఆనంద్ బాలయోగి- జాయింట్ సెక్రటరీ, భారతీయ యోగా అసోసియేషన్; యోగాచార్యుడు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సల్యుటోజెనిసిస్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్ (ISCM) డైరెక్టర్; డా. ఎస్ పి మిశ్రా- హరిద్వార్‌లోని దేవ్ సంస్కృతి విశ్వవిద్యాలయ వ్యవస్థాపక వైస్-ఛాన్సలర్; డాక్టర్ ఎన్ కె మంజునాథ్ భారతీయ యోగా అసోసియేషన్ రీసెర్చ్ కమిటీ డైరెక్టర్; కమలేష్ బర్వాల్

ఈ సదస్సులో భాగంగా యోగా పరిశోధనకు సంబంధించి మూడు ఎంవోయూలపై సంతకాలు చేయనున్నారు. ఆ ఒప్పందాలు ఇవే..

  • శ్రీశ్రీ ఇన్‌స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రీసెర్చ్ వింగ్ - ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సలుటోజెనిసిస్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్ మధ్య శ్రీ బాలాజీ విద్యాపీఠ్ విశ్వవిద్యాలయం, పుదుచ్చేరి మధ్య ఒప్పందంలో భాగంగా  యోగ, ధ్యానం, సంగీతం, మంత్ర జపాల ప్రభావాన్ని వ్యాధుల నివారణకు ఉపయోగించడంపై వైద్యశాలల వాతావరణంలో పరిశోధిస్తారు.  ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులు ఈ రెండు చోట్లా పరిశోధనలు, చదువు సాగించి మాస్టర్స్, డాక్టరేట్ పట్టాలను పొందే వీలుంటుంది.
  • సాంకేతిక నైపుణ్యం, ఆచరణాత్మక శాస్త్రీయ విధానాలను పురాతన సంప్రదాయాల స్వచ్ఛతతో సమ్మిళితం చేసి యోగాను అందించడంలో ప్రసిద్ధి చెందిన శ్రీశ్రీ స్కూల్ ఆఫ్ యోగా, శ్రీశ్రీ ఇన్‌స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రీసెర్చ్ వింగ్ - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్ ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా డిజిటల్ సాంకేతికతలను ఉపయోగించి యోగాలో అత్యున్నత ప్రమాణాలను సృష్టించడంపై పరిశోధనలు సాగిస్తారు.
  • టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్,  భారతీయ యోగా అసోసియేషన్ మధ్య ఒప్పందం. భారతీయ యోగా అసోసియేషన్ సభ్య సంస్థలకు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కు పరస్పర ఆసక్తి గల అంశాలపై సహకారాన్ని అందించడం ఈ ఒప్పందం లక్ష్యం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని