Naveen Patnaik: నవీన్‌ పట్నాయక్‌ రాజీనామా.. ఒడిశా తదుపరి సీఎం ఎవరో?

తాజా అసెంబ్లీ ఎన్నికల్లో తమ ప్రభుత్వం మెజార్టీ సాధించకపోవడంతో తన ముఖ్యమంత్రి పదవికి నవీన్‌ పట్నాయక్‌ రాజీనామా చేశారు.

Updated : 05 Jun 2024 14:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒడిశాను 24ఏళ్లపాటు ఏకధాటిగా పాలించిన బిజూ జనతాదళ్‌ అధినేత నవీన్‌ పట్నాయక్‌కు తొలిసారి ఓటమి ఎదురయ్యింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. గవర్నర్‌ రఘుబర్‌ దాస్‌కు రాజీనామా లేఖను అందించారు. వెంటనే దాన్ని ఆమోదిస్తున్నట్లు గవర్నర్‌ పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేవరకు తాత్కాలిక సీఎంగా కొనసాగమని కోరారు.  

ఒడిశా అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో భాజపా విజయ దుందుభి మోగించింది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకు గాను భాజపా 78 స్థానాలతో మెజార్టీ మార్కును దాటింది. బిజద 51, కాంగ్రెస్‌ 14, ఇతరులు 4 చోట్ల విజయం సాధించారు. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు భాజపా సిద్ధమైంది. అటు మొత్తం 21 లోక్‌సభ స్థానాలకు 20చోట్ల భాజపా విజయం సాధించగా,  ఒకచోట కాంగ్రెస్‌ గెలుపొందింది. బిజూ జనతాదళ్‌ (బిజద) ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది.

కొత్త సీఎం ఎవరో?

రెండున్నర దశబ్దాల తర్వాత రాష్ట్ర సీఎంగా కొత్త వ్యక్తి రానుండటంపై ఆ రాష్ట్ర రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో భాజపా తరఫున కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, కేంద్ర మాజీ మంత్రి జోయల్‌ ఓరం, భాజపా అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర, భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు భైజయంత్‌ పండ ముఖ్యమంత్రి అభ్యర్థి జాబితాలో ముందున్నారు. అయితే, వీరంతా లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించడంతో ఒడిశా సీఎంగా కాషాయ పార్టీ కొత్తవారిని పరిచయం చేసే అవకాశం ఉండవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నవీన్‌ పట్నాయక్‌కు ప్రత్యామ్నాయంగా ఎవరిని తీసుకువస్తుందనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు