Amit Shah: దేవుడి పేరుతో బెట్టింగ్‌ యాప్‌.. కాంగ్రెస్‌పై అమిత్‌ షా విమర్శలు

దేవుడి పేరుతో బెట్టింగ్‌ యాప్‌లను నిర్వహిస్తున్నందుకు ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సిగ్గుపడాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు.

Published : 09 Nov 2023 16:21 IST

రాయ్‌పుర్‌: ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చంద్రయాన్‌ను విజయవంతంగా చేపట్టి.. విక్రమ్‌ ల్యాండర్‌ దిగిన ప్రాంతానికి శివశక్తి పాయింట్ అని పేరు పెడితే.. ఛత్తీస్‌గఢ్‌లో భూపేశ్‌ బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం.. దేవుడి పేరుతో బెట్టింగ్‌ యాప్‌లను నిర్వహిస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amit Shah) విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జాష్‌పుర్‌లో భాజపా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ మత మార్పిడులను ప్రోత్సహించిందని ఆరోపించారు. 

‘‘ఛత్తీస్‌గఢ్‌లో భాజపా నేతృత్వంలోని డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అధికారంలోకి రాగానే.. ఐదేళ్లలో రాష్ట్రంలో నక్సలిజం లేకుండా చేస్తాం. కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది. భూపేశ్‌ బఘేల్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడింది. దేవుడి పేరుతో బెట్టింగ్‌ యాప్‌లు నిర్వహిస్తున్నందుకు కాంగ్రెస్‌ పార్టీ సిగ్గుపడాలి. భాజపా అధికారంలోకి రాగానే.. ప్రత్యేకంగా విచారణ కమిటీని ఏర్పాటు చేసి.. అవినీతిపరులను జైలుకు పంపుతాం. ఆదివాసీల అనుమతి లేకుండా మత మార్పిడిలకు భాజపా అనుమతించదు’’ అని అమిత్‌ షా అన్నారు. 

ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. మొదటి విడతలో భాగంగా 20 స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరిగాయి. రెండో విడతలో మిగిలిన 70 స్థానాలకు నవంబరు 17న పోలింగ్ జరగనుంది. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని