Encounter: దండకారణ్యంలో భీకర ఎన్‌కౌంటర్‌.. 8 మంది మావోయిస్టుల మృతి

Encounter: బీజాపుర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు హతమయ్యారు.

Updated : 02 Apr 2024 15:14 IST

రాయ్‌పుర్‌: లోక్‌సభ ఎన్నికలు (Lok sabha Elections) సమీపిస్తున్న వేళ ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో మరోసారి భీకర ఎన్‌కౌంటర్‌ (Encounter) చోటుచేసుకుంది. బీజాపుర్‌ (Bijapur) జిల్లాలోని దండకారణ్యంలో భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య మంగళవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మావోయిస్టులను మట్టుబెట్టినట్లు భద్రతా దళాలు వెల్లడించాయి.

బీజాపుర్‌ జిల్లా లెండ్రా గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దాగి ఉన్నట్లు సమాచారం రావడంతో యాంటీ-నక్సల్స్‌ ఆపరేషన్‌ చేపట్టారు. డీఆర్‌జీ, స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌, సీఆర్పీఎఫ్‌, కోబ్రా కమాండ్‌ యూనిట్‌ బలగాలు ఇందులో పాల్గొన్నాయి. అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది గాలింపు చేపట్టగా.. మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో బలగాలు ఎదురుకాల్పులు చేపట్టాయి.

కాల్పులు ముగిసిన అనంతరం ఘటనాస్థలంలో ఎనిమిది మృతదేహాలను భద్రతా సిబ్బంది గుర్తించారు. లైట్‌ మెషిన్‌ గన్‌, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతున్నట్లు బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌రాజ్‌ వెల్లడించారు.

సాధారణంగా ఏటా మార్చి-జూన్‌ మధ్య మావోయిస్టులు ఈ ప్రాంతంలో వ్యూహాత్మక ఎదురుదాడి శిక్షణ కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. ఆ సమయంలోనే బస్తర్‌ ప్రాంతంలో భద్రతా బలగాలపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతాయని పోలీసులు వెల్లడించారు. ఈసారి లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దాడులు పెరిగే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యగా ఈ ఆపరేషన్‌ చేపట్టినట్లు పేర్కొన్నారు.

మార్చి 27న కూడా బీజాపుర్‌ జిల్లాలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. అందులో ఆరుగురు మావోయిస్టులను బలగాలు మట్టుబెట్టాయి. తాజా ఘటనతో కలిపి బస్తర్‌ ప్రాంతంలో ఇప్పటివరకు జరిగిన పలు ఎదురుకాల్పుల్లో మొత్తం 41 మంది మావోయిస్టులు హతమైనట్లు పోలీసులు వెల్లడించారు. బీజాపుర్‌ జిల్లా బస్తర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది. ఈ స్థానానికి ఏప్రిల్‌ 19న తొలి విడతలోనే పోలింగ్‌ జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని