Lok Sabha Elections: ఈసారి ఎన్డీయే 400 సీట్ల మార్కు దాటుతుంది: ప్రధాని మోదీ

వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే 400 సీట్ల మార్కు దాటడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తంచేశారు.

Published : 28 Feb 2024 21:44 IST

యావత్మాల్‌: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో(Lok Sabha Elections) భాజపా సారథ్యంలోని ఎన్డీయే కూటమి (NDA) 400కు పైగా సీట్లు గెలుచుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) విశ్వాసం వ్యక్తంచేశారు. తమ ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో ఈ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామన్నారు. బుధవారం సాయంత్రం మహారాష్ట్రలోని యావత్మాల్‌లో పీఎం కిసాన్‌ నిధులు విడుదలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. ‘పదేళ్ల క్రితం నేను ఛాయ్‌ పే చర్చ కోసం యావత్మాల్‌కు వచ్చినప్పుడు మీరు నన్ను ఆశీర్వదించారు. దేశ ప్రజలు ఎన్డీయేను 300కు పైగా సీట్లలో గెలిపించారు. మళ్లీ 2019 ఫిబ్రవరిలో ఇక్కడికి వచ్చా. అప్పుడూ మీరు నాపై ఎంతో ప్రేమ చూపించారు. ఆ ఎన్నికల్లోనూ ఎన్డీయేకు 350 మార్కుదాటింది.  ఈరోజు 2024 ఎన్నికల ముందు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చినప్పుడు దేశమంతా అదే స్వరం ప్రతిధ్వనిస్తోంది. ఈసారి ఎన్డీయేకు 400కు పైగా సీట్లు వస్తాయి. గత యూపీయే ప్రభుత్వ హయాంలో దేశంలో పరిస్థితి ఎలా ఉండేదో మీకు గుర్తుందా? అప్పట్లో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి మహారాష్ట్రకు చెందినవారే. విదర్భ రైతుల పేరిట దిల్లీ నుంచి ప్రకటించిన ప్యాకేజీని మధ్యలోనే తినేశారు. గ్రామాలు, రైతులు, పేదలు, గిరిజనులకు ఏమీ అందలేదు. కానీ ఈరోజు చూస్తే..  నేను ఒక బటన్‌ని నొక్కగానే పీఎం కిసాన్ నిధులు దేశంలోని కోట్లాది మంది రైతుల ఖాతాల్లోకి చేరాయి. ఇదీ మోదీ హామీ’’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని