Lok Sabha Elections: ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. 62.37% పోలింగ్‌ నమోదు

First phase of LS polls: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. 

Updated : 19 Apr 2024 22:36 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల (Lok sabha Elections) సమరంలో తొలి విడత పోలింగ్‌ (First Phase Voting) శుక్రవారం ముగిసింది. పలుచోట్ల స్వల్ప హింసాత్మక ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది. ఇప్పటివరకు సగటున 67.32% పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. పూర్తి గణాంకాలు శనివారానికి వస్తాయని, పోలింగ్‌ శాతాలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలైన్లలో ఉన్నవారికి అవకాశం కల్పించారు. తొలి విడతలో 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 

రాష్ట్రాల వారీగా పోలింగ్‌ శాతాలు ఇలా.. (ఓటర్‌ టర్న్‌ అవుట్‌ ప్రకారం..)

రాత్రి 10.30గంటల వరకు ఉన్న సమాచారం మేరకు అండమాన్‌ నికోబార్‌దీవులు 63.99%, అరుణాచల్‌ప్రదేశ్‌ 67.70, అస్సాం 72.27, బిహార్‌ 48.50, ఛత్తీస్‌గఢ్‌ 65.29, జమ్మూకశ్మీర్‌ 65.20, లక్షద్వీప్‌ 59.02, మధ్యప్రదేశ్‌ 66.69, మహారాష్ట్ర 57.82, మణిపుర్‌ 69.18, మేఘాలయ 74.48, మిజోరం 56.60, నాగాలాండ్‌ 56.91, పుదుచ్ఛేరి 74.37, రాజస్థాన్‌ 57.26, సిక్కిం 76.28, తమిళనాడు 67.61, త్రిపుర 80.61, ఉత్తరప్రదేశ్‌ 59.49, ఉత్తరాఖండ్‌ 54.58, పశ్చిమబెంగాల్‌ 77.57 చొప్పున పోలింగ్ శాతాలు నమోదయ్యాయి. మరోవైపు, లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న అరుణాచల్‌ప్రదేశ్‌లో 70.11శాతం, సిక్కింలో 76.03శాతం చొప్పున పోలింగ్‌ నమోదైనట్లు పేర్కొంది.

పశ్చిమబెంగాల్‌లోని కోచ్‌బిహార్‌లో తృణమూల్‌, భాజపా వర్గాల మధ్య హింస చోటుచేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. మరోవైపు, ఛత్తీస్‌గఢ్‌లో గ్రనేడ్‌ దాడి జరగడంతో ఓ సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ ప్రాణాలు కోల్పోయారు. అరుణాచల్‌ప్రదేశ్‌, అస్సాం, అండమాన్‌ నికోబార్‌ దీవులు వంటి పలుచోట్ల ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పలుచోట్ల దాదాపు గంట ఆలస్యంగా పోలింగ్‌ మొదలైంది. తొలి విడత ఎన్నికల్లో ఓటేసేందుకు కొత్తగా ఓటు హక్కు పొందిన యువతతో పాటు కొత్తగా పెళ్లయిన జంటలు సంప్రదాయ వస్త్రధారణతో పోలింగ్‌ కేంద్రానికి ఉత్సాహంగా వచ్చి ఓటేశారు. అలాగే, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఓటేసేందుకు వచ్చారు. దివ్యాంగులు, వృద్ధులు సైతం పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలివిడత ఎన్నికలకు 1.87 లక్షల పోలింగ్‌ కేంద్రాల్లో దాదాపు 18 లక్షల మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు