NEET Paper Leak: నీట్‌ పేపర్‌ లీకేజీ కేసు.. ప్రధాన నిందితుడి అరెస్టు

Eenadu icon
By National News Team Published : 25 Apr 2025 13:41 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్‌- యూజీ ప్రవేశపరీక్ష 2024 (NEET UG-2024)’లో ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడైన సంజీవ్‌ ముఖియా (Sanjeev Mukhiya)ను ఆర్థిక నేర విభాగం (ఈవోయూ) బృందం అరెస్టు చేసింది. గురువారం  రాత్రి అతడిని పట్నాలో అరెస్టు చేశామని ఈవోయూ అధికారి నయ్యర్‌ హుస్సేన్‌ ఖాన్‌ వెల్లడించారు. 

నీట్‌ పేపర్‌ లీకేజీ కేసులో ప్రధాన కుట్రదారుగా సంజీవ్‌ ముఖియా పేరు వినిపించింది. ఈ వివాదం నేపథ్యంలో అతడు పరారయినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల బిహార్‌ (Bihar) ప్రభుత్వం సంజీవ్‌పై రూ.3లక్షల నజరానా ప్రకటించింది. ఈక్రమంలోనే అతడు పట్నాలోని ఒక అపార్టుమెంట్‌లో ఉన్నట్లు సమాచారం అందడంతో అధికారులు అతడిని అరెస్టు చేశారు. ముఖియా అరెస్టుతో పేపర్‌ లీక్‌కు కారుకులైన మరింతమంది వ్యక్తుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

బిహార్‌లోని నలందా జిల్లా నాగర్‌సోనా ప్రాంతానికి చెందిన సంజీవ్‌ (Sanjeev Mukhiya) తొలుత సాబూర్‌ అగ్రికల్చర్‌ కాలేజీలో పని చేసేవాడు. అక్కడ పేపర్‌ లీక్‌ చేసినట్లు ఆరోపణలు రావడంతో 2016లో అతడిపై వేటు వేశారు. ఆ కేసులో కొన్నాళ్ల పాటు జైలు శిక్ష కూడా అనుభవించాడు. అనంతరం నలందా కాలేజీ నూర్‌సరయ్‌ బ్రాంచ్‌లో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా చేరాడు. నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారంపై మధ్యవర్తులు, విద్యార్థులు సహా 14 మందిని బిహార్‌ పోలీసులు అరెస్టు చేసి విచారించగా.. సంజీవ్‌ ముఖియా పేరు ప్రధానంగా బయటకొచ్చింది.  కాగా.. సంజీవ్‌ కుమారుడు శివ్‌కుమార్‌కూ ఈ వ్యవహారంలో హస్తం ఉన్నట్లు తేలింది. బిహార్‌ ఉపాధ్యాయ నియామక పరీక్ష పేపర్‌ లీక్‌ కేసులో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. వీరిద్దరూ ‘ముఖియా సాల్వర్‌ గ్యాంగ్‌’ పేరుతో ఓ ముఠాను ఏర్పాటుచేసినట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు