NEET PG Exam: నీట్‌ పీజీ పరీక్ష వాయిదా.. కారణం ఏమిటంటే..?

Eenadu icon
By National News Team Published : 02 Jun 2025 19:55 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

దిల్లీ: జూన్‌ 15న జరగాల్సిన నీట్‌ పీజీ పరీక్ష వాయిదా పడింది. వైద్య విద్యలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ (పీజీ) కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే ఈ జాతీయస్థాయి అర్హత పరీక్షను ఒకే షిఫ్టులో నిర్వహించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తగిన సంఖ్యలో పరీక్షా కేంద్రాలు, మౌలికసదుపాయాల ఏర్పాటు కోసం నీట్‌ పీజీ పరీక్ష(NEET PG Exam)ను వాయిదా వేస్తున్నట్లు నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌(NBEMS) ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ పరీక్ష నిర్వహించే కొత్త తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపింది.

సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే?

వైద్య విద్యలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ (పీజీ) కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే జాతీయస్థాయి అర్హత పరీక్ష (నీట్‌)కు సంబంధించి సుప్రీంకోర్టు మే 30న కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్‌15న జరగనున్న నీట్‌-పీజీ 2025ని ఒక షిఫ్ట్‌లోనే ముగించాలని జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ సంజయ్‌ కుమార్, జస్టిస్‌ ఎన్‌.వి.అంజారియా ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పరీక్షను రెండు షిఫ్ట్‌లలో నిర్వహించడం కొన్ని సమస్యలకు కారణమవుతోందని పేర్కొంది.   పరీక్ష నిర్వహణలో పూర్తి పారదర్శకతను పాటించాలని, సురక్షితమైన పరీక్షా కేంద్రాలనే ఎంచుకోవాలని సూచించింది. రెండు ప్రశ్నాపత్రాలు ఎప్పటికీ ఒకే విధమైన కాఠిన్య లేదా సులభ స్థాయిని కలిగిఉండవని అభిప్రాయపడింది. 

పోటీ తీవ్రత దృష్ట్యా ప్రతి మార్కూ ర్యాంకు నిర్ధారణలో అత్యంత కీలకమేనని తెలిపింది. నార్మలైజేషన్‌ విధానాన్ని కొన్ని ప్రత్యేక కేసుల్లో మాత్రమే అనుసరించాలని, ప్రతి ఏడాదీ నిర్వహించుకునే పరీక్షకు అది సరికాదని ధర్మాసనం పేర్కొంది. నీట్‌-పీజీ 2025ని రెండు ఫిఫ్ట్‌లలో నిర్వహిస్తారంటూ వెలువడిన నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చింది. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినందున దేశమంతటికీ ఒకే షిఫ్ట్‌లో పరీక్ష నిర్వహించడం కష్టంకాబోదని చెబుతూ అధికారుల అభ్యంతరాలను తోసిపుచ్చింది. పరీక్ష నిర్వహణకు ఇంకా రెండు వారాలకు పైగా సమయం ఉన్నందున సురక్షితమైన పరీక్షాకేంద్రాల ఎంపిక కష్టమేమీ కాదని స్పష్టం చేసింది. ఏర్పాట్లకు సమయం సరిపోదని అధికారులు భావిస్తే పరీక్ష తేదీని పొడిగించుకునే స్వేచ్ఛనిస్తామని పేర్కొంటూ తదుపరి విచారణను జూన్‌ 14కు వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు