Neha Sharma: లోక్‌సభ ఎన్నికల బరిలో ‘చిరుత’ నటి..?

Neha Sharma: ‘చిరుత’ సినిమాలో హీరోయిన్‌గా మెప్పించిన నటి నేహాశర్మ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Updated : 23 Mar 2024 15:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ రంగం నుంచి మరో నాయిక రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ బాలీవుడ్‌ నటి, మోడల్‌ నేహాశర్మ (Neha Sharma) వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో (Lok sabha Elections 2024) పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బిహార్‌ (Bihar) నుంచి ఆమెను బరిలోకి దింపాలని నేహా తండ్రి, కాంగ్రెస్‌ నేత అజిత్‌ శర్మ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. దీనిపై తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘బిహార్‌లోని భగల్‌పుర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు మంచి పట్టు ఉంది. ‘ఇండియా’ కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ స్థానం కాంగ్రెస్‌కే దక్కాలి. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ సీటు మా పార్టీకి వస్తే.. నేను పోటీ చేయడం లేదా నా కుమార్తె నేహాశర్మను బరిలోకి దించాలని భావిస్తున్నా. దీనిపై పార్టీని సంప్రదిస్తున్నా. తుది నిర్ణయం హైకమాండ్‌దే’’ అని భగల్‌పుర్‌ ఎమ్మెల్యే అజిత్ శర్మ వెల్లడించారు.

బిహార్‌లో మొత్తం 40 లోక్‌సభ స్థానాలున్నాయి. ఇప్పటికే ఎన్డీయే మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకాలు పూర్తవగా.. ‘ఇండియా’ కూటమి చర్చలు జరుపుతోంది. త్వరలోనే దీనిపై ప్రకటన ఉంటుందని ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌ వెల్లడించారు.

హీరో రామ్‌చరణ్‌ నటించిన ‘చిరుత’ సినిమాతో వెండి తెరకు పరిచయమైన నేహా శర్మ.. ఆ తర్వాత ‘కుర్రాడు’ చిత్రంలో కన్పించింది. అనంతరం టాలీవుడ్‌కు దూరమైన ఆమె.. పలు బాలీవుడ్‌, తమిళ్‌, మలయాళ సినిమాల్లో నటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని