S Jaishankar: చైనా విషయంలో ఆయన హెచ్చరికలను నెహ్రూ పట్టించుకోలేదు: జైశంకర్‌

భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చైనా విదేశాంగ విధానంపై పటేల్‌ చేసిన హెచ్చరికలను అప్పటి ప్రధాని నెహ్రూ పట్టించుకోలేదని కేంద్ర మంత్రి జైశంకర్‌ తెలిపారు.

Published : 20 Mar 2024 15:12 IST

దిల్లీ: భారత మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చైనాపై ఉదాసీన వైఖరితో వ్యవహరించే వారని కేంద్ర మంత్రి జైశంకర్‌ అన్నారు. చైనా విషయంలో నెహ్రూను పలుమార్లు సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ హెచ్చరించారని తెలిపారు. బుధవారం ఒక జాతీయ వార్తా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో జైశంకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైనా, అమెరికాలతో సంబంధాలు, భారత్‌ విదేశాంగ వైఖరిపై మాట్లాడారు. 

‘‘చైనా విషయంలో మాజీ ప్రధాని నెహ్రూ అవలంభించిన విదేశాంగ విధానం బుడగతో సమానం. ఆయనకు అమెరికా అంటే కోపం. అందుకే భారత్‌కు చైనా గొప్ప మిత్ర దేశమన్నారు. అప్పట్లో అందరూ దాన్నే నమ్మారు. ఇప్పటికీ కొంతమంది అదే మాట చెబుతున్నారు. కానీ, చైనా స్నేహాన్ని ఉదాసీన వైఖరితో చూడొద్దని నెహ్రూను పటేల్‌ ఎన్నోసార్లు హెచ్చరించారు. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పాకిస్థాన్‌, చైనా వ్యవహారాలపై అప్పటి మంత్రులు శ్యామ్ ప్రసాద్‌ ముఖర్జీ, పటేల్‌లు ఆందోళన వ్యక్తంచేసినా నెహ్రూ సరైన దృష్టి సారించలేదు. హిమాలయాల మీదుగా ఆక్రమణకు ప్రయత్నిస్తారని అనుకోవడం లేదని చెప్పారు. కానీ, 1962లో చైనా ఆ దుశ్చర్యకు పాల్పడింది. 1950లో అమెరికాకు భారత్‌ దూరం కావడానికి చైనానే కారణం. దీనిపై నెహ్రూని అప్పటి న్యాయశాఖ మంత్రి డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ప్రశ్నించారు. ఈ విషయాలేవీ ఇప్పటితరం వారికి తెలియవు. నెహ్రూ విదేశాంగ విధానాలనే తర్వాత వచ్చిన పాలకులు అనుసరించారు. ఒకవేళ దానికి భిన్నంగా వ్యవహరిస్తే దాన్ని పెద్ద తప్పుగా ప్రచారం చేస్తున్నారు. కంపెనీల్లో ఆడిట్‌ వ్యవస్థ ఉన్నట్లే దేశాలు అనుసరిస్తున్న విధానాలకు ఆడిట్‌ ఉండాలి’’ అని జైశంకర్‌ పేర్కొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని