‘మీరు పడేసిన చెత్తను మీరే తీసుకెళ్లండి’: అటల్‌ టన్నెల్ వద్ద దృశ్యాలపై నెటిజన్ల విమర్శలు

ప్రకృతి అందాలను వీక్షించడానికి వచ్చి, కొందరు పర్యాటకులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh)లో కూడా న్యూ ఇయర్ వేడుకల వేళ.. కొన్ని ప్రాంతాలు చెత్తమయంగా మారాయి. దీనిపై నెట్టింట్లో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

Updated : 01 Jan 2024 16:19 IST

శిమ్లా: క్రిస్మస్-నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా వేల సంఖ్యలో పర్యటకులు హిమాలయ రాష్ట్రం హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh)కు తరలివచ్చారు. వారంతా రోహ్‌తంగ్‌ ప్రాంతంలోని అటల్ టన్నెల్‌ (Atal Tunnel) ద్వారా రాకపోకలు సాగించారు. కులు, లాహౌల్-స్పితి లోయ వంటి పర్యాటక ప్రాంతాల్లో ఎంజాయ్ చేశారు. ప్రకృతి సౌందర్యంతో నిండిన ఆ ప్రాంతాల్లో ఇప్పుడు చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. ఇలా చెత్తను వదిలివెళ్లిన టూరిస్టులపై నెట్టింట్లో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆ దృశ్యాలను షేర్ చేస్తూ.. ఐఎఫ్‌ఎస్‌ అధికారి పర్వీన్‌ కాస్వాన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘రాత్రికి రాత్రే.. చెరువు మాయం.. బిహార్‌లో మరో ఘటన!’

‘ఈ కొండ ప్రాంతాల్లో మనం ఏం వదిలి వెళ్తున్నాం..! ప్రతిరోజూ అటల్‌ టన్నెల్‌ (Atal Tunnel) ద్వారా ఎన్నో వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఈ టన్నెల్ దాటగానే మనకు మొదట తగిలే గ్రామాలు సిస్సు, ఖోక్సర్‌. ఇది సిస్సు గ్రామంలోని చెత్త పేరుకుపోయిన దృశ్యం. మీ వల్ల ఏర్పడిన చెత్తను అలా వదిలివెళ్లడమేనా..? మీ వెంట తీసుకెళ్లండి’ అంటూ మండిపడ్డారు. ఈ వ్యవహారంపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. చెత్త నిర్వహణకు కూడా ఒక మంత్రిత్వ శాఖ ఉండాలని సూచనలు చేశారు. కఠిన చట్టాలు, శిక్షలు ఉండాలని అభిప్రాయపడ్డారు.

రోహ్‌తంగ్‌లో నిర్మించిన సొరంగ మార్గం అటల్‌ టన్నెల్‌ 2020లో ప్రారంభమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగ మార్గం ఇదే. దీనికి మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పేరు పెట్టారు. దీని పొడవు 9.02 కిలోమీటర్లు. హిమాలయాల్లోని పిర్‌ పంజాల్‌ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో అత్యాధునిక ప్రమాణాలతో దీన్ని నిర్మించారు. దీనివల్ల మనాలీ-లేహ్‌ల మధ్య 46 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు 4-5 గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. మంచు వల్ల వాహనాల రాకపోకలకు కలిగే అంతరాయాలను ఇది నివారిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని