Rameshwaram Cafe Blast: ‘రామేశ్వరం కెఫే బ్లాస్ట్‌’ కేసులో..టోపీ ఆధారంగా బాంబర్‌ అరెస్ట్‌..!

రామేశ్వరం కెఫే (Rameshwaram Cafe) బాంబు పేలుడు కేసులో ఇద్దరు ప్రధాన నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. 

Updated : 12 Apr 2024 18:43 IST

బెంగళూరు: రామేశ్వరం కెఫే (Rameshwaram Cafe) బాంబు పేలుడు కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ఇద్దరు ప్రధాన నిందితులను తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. బాంబర్ ముస్సావిర్ హుస్సెన్‌ షాజిబ్‌, సూత్రధారి అబ్దుల్ మతీన్‌ తాహాను అరెస్టు చేసింది. పేలుడు జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్నవారు అస్సాం, పశ్చిమ్‌ బెంగాల్‌లో తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. 

పట్టించిన క్యాప్‌..!

నిందితులిద్దరినీ ఓ క్యాప్‌ పట్టించింది. దానిని కొనడానికి వెళ్లినప్పుడు సీసీటీవీలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించారు. వీరు తరచూ సిమ్‌ కార్డులు మార్చుతూ అండర్‌గ్రౌండ్‌కు వెళ్లేదుకు యత్నించినప్పటికీ.. ఎన్‌ఐఏ రాడార్‌ నుంచి వారు తప్పించుకోలేకపోయారు. పేలుడుకు మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్న నిందితుడు మల్నాడు ప్రాంత వాసి అని ఇప్పటికే దర్యాప్తు సంస్థ గుర్తించింది. గతంలో శివనసముద్రం, గుండ్లుపేట, తమిళనాడులోని కృష్ణగిరి అటవీ విభాగంలో కొందరు యువకులకు ఆయుధాల వినియోగంపై శిక్షణ ఇచ్చాడని పేర్కొంది. 

మార్చిలో బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్‌లో ఉన్న కెఫేలో బాంబు పేలిన ఘటనలో 9 మంది గాయపడ్డారు. ఈ కేసును కర్ణాటక హోంశాఖ ఎన్‌ఐఏకు అప్పగించింది.  నిందితుడు ఆర్‌డీఎక్స్‌ ఉపయోగించాడని నిపుణులు గుర్తించారు. అతడు ఏ మార్గంలో కెఫేలోకి వచ్చాడు? బాంబు అమర్చిన తర్వాత ఎలా వెళ్లాడు? అనే అంశంపై సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు అనుమానితులను విచారించారు. బాంబర్‌ కెఫేలో అనుమానాస్పదంగా తిరుగుతూ రవ్వ ఇడ్లీ తిని తన చేతిలోని పేలుడు పదార్థాలున్న సంచిని అక్కడపెట్టి హడావుడిగా వెళ్లినట్లు సీసీ కెమెరా చిత్రాల ద్వారా గుర్తించారు. ఈ క్రమంలో ఐదు కిలోమీటర్ల పరిధిలోని వందల కొద్దీ సీసీ కెమెరాల దృశ్యాలను విశ్లేషించారు. టోపీ ధరించిన వ్యక్తి నోటికి మాస్కు కట్టుకుని నల్లబూట్లు, అదే రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు గుర్తించారు. దీంతో టోపీ ఆధారంగా పోలీసులు వేట మొదలుపెట్టడంతో.. వారు కొనుగోలు చేస్తున్నప్పటి దృశ్యాలు దర్యాప్తు బృందం చేతికి చిక్కాయి. దీంతో నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని