Rameshwaram Cafe: బెంగళూరు కేఫ్‌ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్‌!

బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్‌లో ‘రామేశ్వరం కేఫ్‌’ బాంబు పేలుడు ఘటనలో కీలక కుట్రదారుని అరెస్టు చేసినట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది.

Published : 28 Mar 2024 22:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బెంగళూరు బ్రూక్‌ఫీల్డ్‌లోని ‘రామేశ్వరం కేఫ్‌’ బాంబు పేలుడు కేసు దర్యాప్తులో అధికారులు పురోగతి సాధించారు. ఈ ఘటనలో కీలక కుట్రదారుగా అనుమానిస్తోన్న వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్టు చేసింది. మూడు రాష్ట్రాల్లో విస్తృత గాలింపు అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది. మార్చి 1న జరిగిన కేఫ్‌లో బాంబు పేలుడులో అనేక మంది వినియోగదారులు, సిబ్బంది గాయపడిన సంగతి తెలిసిందే.

దర్యాప్తులో భాగంగా మూడు రాష్ట్రాల్లో 18 చోట్ల ఎన్‌ఐఏ గాలింపు చేపట్టింది. కర్ణాటకలో 12 చోట్ల, తమిళనాడులో ఐదు, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒకచోట దాడులు చేసిన ఎన్‌ఐఏ బృందాలు.. ఈ కేసుతో సంబంధమున్న ఇద్దరు వ్యక్తులకు సాయం చేసిన ముజమ్మిల్‌ షరీఫ్‌ అనే వ్యక్తిని అరెస్టు చేసింది.

‘రామేశ్వరం కేఫ్‌’ బాంబుపేలుడు కేసు దర్యాప్తు బాధ్యతలను మార్చి 3న ఎన్‌ఐఏ చేపట్టింది. ఈ ఘటనలో పాల్గొన్న ఇద్దరు నిందితులను ముస్సావిర్‌ షాజీబ్‌ హుస్సేన్‌, అబ్దుల్‌ మథీన్‌ తహాలుగా గుర్తించింది. ఘటనకు ముందు వీరు చెన్నైలోని ఓ లాడ్జిలో నెల రోజులు ఉన్నట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది. వీరిద్దరికీ సాయం చేసిన షరీఫ్‌ను తాజాగా అరెస్టు చేసింది. ఇతడినే కీలక కుట్రదారుగా ఎన్‌ఐఏ భావిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని