Bengaluru: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. ఏపీ, తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు

రామేశ్వరం కెఫే (Rameshwaram Cafe) బాంబు పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సోదాలు జరిపింది.

Published : 21 May 2024 21:53 IST

బెంగళూరు: రామేశ్వరం కెఫే (Rameshwaram Cafe)లో బాంబు పేలుడు కేసులో అనేక కోణాలు బయటకు వస్తున్నాయి. ఈ కుట్రకు సహకరించిన వారిని గుర్తించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తీవ్రంగా యత్నిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో సోదాలు జరిపింది. పలువురు అనుమానితులను గుర్తించిన ఎన్‌ఐఏ, డిజిటల్‌ పరికరాలు, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది.

ఈ ఘటనలో ఇప్పటికే పలువురు నిందితులను ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి సేకరించిన కీలక సమాచారం ఆధారంగా మరికొంత మందికి సంబంధమున్నట్లు అనుమానించారు. ఈ క్రమంలోనే ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మొత్తం 11 చోట్ల సోదాలు జరిపారు. పలువురు అనుమానితులను గుర్తించినట్లు సమాచారం. బెంగళూరులోని కుమారస్వామి లేఅవుట్‌, బానాశంకరీ తదితర ప్రాంతాల్లో దాడులు చేసినట్లు వెల్లడించారు.

ఈ కేసును ఎన్‌ఐఏ మార్చి 3న తన పరిధిలోకి తీసుకుంది. అనంతరం కీలక సూత్రధారి అబ్దుల్‌ మథీన్‌ అహ్మద్‌ తాహాతోపాటు మరో నిందితుడిని ఏప్రిల్‌ 12న కోల్‌కతాలో అరెస్టు చేసింది. కేఫ్‌లో బాంబును అమర్చింది తహాయేనని భావిస్తున్నారు. వీరిద్దరూ శివమొగ్గ కేంద్రంగా పనిచేస్తున్న ఓ సంస్థకు చెందిన వారిగా గుర్తించారు. తాజా సోదాల్లో భాగంగా 2012లో బెంగళూరు, హుబ్లీల్లో పేలుళ్ల కుట్ర కేసులో నిందితులుగా ఉన్నవారి ఇళ్లలోనూ ఎన్‌ఐఏ బృందం దాడులు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని