Air India: వరుస బెదిరింపులు.. ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌పై NIA కేసులు

ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించవద్దంటూ హెచ్చరికలు జారీ చేసిన వ్యవహారంలో ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూపై ఎన్‌ఐఏ పలు కేసులు నమోదు చేసింది.

Published : 20 Nov 2023 20:24 IST

దిల్లీ: ఎయిర్‌ ఇండియా (Air India) విమానాల్లో ప్రయాణించే వారికి ప్రమాదం పొంచి ఉందంటూ ఖలిస్థానీ ఏర్పాటువాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ (Gurpatwant Singh Pannun) ఇటీవల హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ).. గురుపత్వంత్‌పై కేసులు నమోదు చేసింది. ఐపీసీలోని సెక్షన్లతోపాటు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద పలు కేసులు నమోదు చేసినట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది.

ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించవద్దని హెచ్చరిస్తూ గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ నవంబర్‌ 4న ఓ వీడియోను విడుదల చేశాడు. దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నవంబర్‌ 19న మూతపడుతుందని హెచ్చరించాడు. భారత్‌లోని సిక్కు ప్రజలెవరూ ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించొద్దని.. అలా చేస్తే వారి ప్రాణాలకే ప్రమాదమని బెదిరించాడు. అదే రోజున క్రికెట్‌ వన్డే ప్రపంచ క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ కూడా జరగనున్న విషయాన్ని ప్రస్తావించాడు. అంతకుముందు కూడా ఇజ్రాయెల్‌- పాలస్తీనా యుద్ధాన్ని ప్రస్తావిస్తూ ఓ వీడియో పోస్టు చేసిన గుర్‌పత్వంత్‌.. అక్కడి పరిస్థితులను చూసి భారత్‌ నేర్చుకోవాలన్నాడు. లేదంటే  భారత్‌లోనూ అదే తరహా పరిణామాలు ఎదురవుతాయంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇలా వరుస హెచ్చరికల నేపథ్యంలోనే ఎన్‌ఐఏ అతడిపై పలు కేసులు నమోదు చేసింది.

ఇదిలాఉంటే, సిఖ్‌ ఫర్‌ జస్టిస్‌ (SFJ) అనే వేర్పాటువాద సంస్థ వ్యవస్థాపకుల్లో గురుపత్వంత్‌ సింగ్ పన్ను కూడా ఒకడు. 2007లో ఈ సంస్థను స్థాపించగా.. 2019లో భారత్‌ దాన్ని నిషేధించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద గురుపత్వంత్‌ను కూడా భారత ప్రభుత్వం 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని