Bengaluru Blast: అది బాంబు పేలుడే.. రామేశ్వరం కేఫ్‌ ఘటనపై సీఎం సిద్ధరామయ్య!

బెంగళూరులో రామేశ్వరం కేఫ్‌లో చోటుచేసుకున్న ఘటనపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య.. అది బాంబు పేలుడేనని (ఐఈడీ) స్పష్టం చేశారు.

Updated : 01 Mar 2024 18:52 IST

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో రామేశ్వరం కేఫ్‌లో (Rameshwaram cafe) చోటుచేసుకున్న పేలుడులో తొమ్మిది మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ.. అది బాంబు పేలుడేనని (ఐఈడీ) స్పష్టం చేశారు. ఓ వ్యక్తి కేఫ్‌లోకి వచ్చి ఓ బ్యాగు పెట్టి వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించిందన్నారు. బ్యాగులో ఉన్న వస్తువు పేలడంతోనే ఆ ఘటన (Bengaluru blasts) జరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నప్పటికీ.. ఫోరెన్సిక్‌ బృందం నివేదిక కోసం వేచి చూస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

‘రామేశ్వరం కేఫ్‌లో పేలుడు సంభవించినట్లు మధ్యాహ్నం 12.30కి సమాచారం వచ్చింది. అక్కడో బ్యాగు కూడా ఉంది. అది పేలుడు పదార్థం (ఐఈడీ) అని తెలిసింది. తక్కువ తీవ్రత కలిగిందని తెలుస్తోంది. కేఫ్‌లోకి వచ్చిన ఓ వ్యక్తి బ్యాగును అక్కడ పెట్టి కౌంటర్‌లో టోకెన్‌ తీసుకున్నాడు. పోలీసులు క్యాషియర్‌ను ప్రశ్నిస్తున్నారు’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. మైసూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన.. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారన్నారు. ఈ ఘటనలో హోటల్‌ సిబ్బందితోసహా మొత్తం తొమ్మిది మందికి గాయాలయ్యాయని చెప్పారు. ఐఈడీ కారణంగానే ఆ పేలుడు సంభవించిందా అన్న విషయాన్ని నిర్ధరించేందుకు నమూనాలు సేకరిస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర వెల్లడించారు. గ్యాస్‌ లీక్‌ కారణంగా పేలుడు జరిగిందని వచ్చిన అనుమానాలను తోసిపుచ్చిన అగ్నిమాపక సిబ్బంది.. ఓ మహిళ హ్యాండ్‌బ్యాగ్‌ అక్కడ లభించిందన్నారు.

చట్టసభ సభ్యుల శరీరాల్లో ‘చిప్‌’ పెట్టలేం..! పిటిషనర్‌కు సుప్రీం మందలింపు

కేఫ్‌లో పేలుడు విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు మొదలుపెట్టారు. అగ్నిమాపక సిబ్బంది, జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)తోపాటు బాంబుస్క్వాడ్‌, ఐబీ, ఫోరెన్సిక్‌ నిపుణులూ రంగంలోకి దిగారు. మరోవైపు ఈ ఘటనపై కేఫ్‌ వ్యవస్థాపకుడు నాగరాజ్‌తో మాట్లాడినట్లు బెంగళూరు దక్షిణ ఎంపీ తేజస్వీ సూర్య తెలిపారు. గ్యాస్‌ సిలిండర్ వల్ల కాదని.. ఓ వినియోగదారుడు వదిలివెళ్లిన బ్యాగ్ వల్లే పేలుడు సంభవించిందని ఆయన తనకు తెలియజేసినట్లు చెప్పారు. ఇది బాంబు పేలుడు కేసేనని, దీనిపై సీఎం సమాధానం చెప్పాలని ‘ఎక్స్‌’ వేదికగా డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని