Nitin Gadkari: మేం చెప్తాం.. మీరు ఎస్‌ సర్ అనండి..!

మంత్రులు తీసుకునే నిర్ణయాల ఆధారంగానే ప్రభుత్వం పనిచేస్తుందని, అందుకే మంత్రులు ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలు పర్చేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.

Updated : 10 Aug 2022 12:16 IST

గడ్కరీ ఈ మాట ఎందుకు చెప్పారంటే..?

దిల్లీ: మంత్రులు తీసుకునే నిర్ణయాల ఆధారంగానే ప్రభుత్వం పనిచేస్తుందని, అందుకే మంత్రులు ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలు పర్చేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. చట్టాలు పేదల సంక్షేమానికి అడ్డుగా నిలవవని చెప్పారు. తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

పేదల సంక్షేమాన్ని ఏ చట్టమూ అడ్డుకోదని చెప్తూ.. మహాత్మా గాంధీ చెప్పిన మాటను ఉటంకించారు. ‘పేదల సంక్షేమానికి ఏ చట్టమూ అడ్డురాదని తెలుసు. ఒకవేళ అలా అడ్డుకునే చట్టాలుంటే వాటిని 10 సార్లు అయినా ఉల్లంఘించేందుకు వెనకాడాల్సిన పనిలేదు. ఇదే మహాత్ముడు చెప్పారు’ అని అన్నారు. ఈ సందర్భంగా 1995 నాటి ఘటనను ఉదహరించారు. ‘మహారాష్ట్రలోని ఓ ప్రాంతంలో పోషకాహారలోపంతో వేల సంఖ్యలో గిరిజన చిన్నారులు మరణించారు. ఈ గ్రామానికి రోడ్లు లేవు. రోడ్లు వేసేందుకు అటవీ చట్టాలు అడ్డుగా నిలిచాయి’ అని చెప్పారు. ఆ సమస్యను తాను పరిష్కరించినట్లు వెల్లడించారు. ‘మీరు చెప్పిన ప్రకారం ప్రభుత్వం పనిచేయదని నేను అధికారులకు ఎప్పుడూ చెబుతుంటాను. మీరు ఎస్‌ సర్‌ అని మాత్రమే చెప్పాలి. మేం చెప్పిన వాటిని మీరు అమలు చేయాలి. మా నిర్ణయాల ఆధారంగానే ప్రభుత్వం పనిచేస్తుంది’ అని గడ్కరీ స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని