Nitish Kumar: దర్యాప్తు సంస్థల సోదాలు..రాజకీయ ప్రేరేపితమే: నీతీశ్‌కుమార్‌

లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబ సభ్యులపై జరుగుతున్న సీబీఐ, ఈడీ దాడులు రాజకీయప్రేరేపితమైనవేనని జేడీయూ అధినేత, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ ఆరోపించారు.

Published : 11 Mar 2023 23:10 IST

పట్నా: ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (Lalu prasad Yadav), ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ (CBI), ఈడీ (ED) దాడులు చేయడాన్ని జేడీయూ అధినేత, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ (Nitish Kumar) తప్పుబట్టారు. కేవలం ఆ కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బతీసేందుకే దర్యాప్తు సంస్థలను కేంద్రం ఉసిగొల్పుతోందని విమర్శించారు. ఈ దాడులన్నీ రాజకీయ ప్రేరేపితమైనవేనని ఆరోపించారు. ఇదే పరిస్థితులు 2017లోనూ ఎదురయ్యాయని నితీశ్‌కుమార్‌ గుర్తు చేశారు. తాజాపరిస్థితుల నేపథ్యంలో మహాఘట్‌ బంధన్‌ కూటమి నుంచి జేడీయూ బయటకి వస్తుందన్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. మహాఘట్‌ బంధన్‌లో జేడీయూతోపాటు ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు సభ్యులుగా ఉన్నారు.

రైల్వే ఉద్యోగాల కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్‌ యాదవ్‌తోపాటు, ఆయన సతీమణి రబ్రీదేవిని సీబీఐ గత వారం ప్రశ్నించిన సంగతి తెలిసిందే. మరోవైపు లాలూ కుటుంబ సభ్యుల ఇళ్లపై ఈడీ దాడులు నిర్వహించి భారీ మొత్తంలో నగదు, బంగారం, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు నీతీశ్‌ కుమార్‌ సమాధానం చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న సీబీఐ, ఈడీ దాడులన్నీ రాజకీయ ప్రేరేపితమైనవేనని అన్నారు. 2017లో జేడీయూ, భాజపాకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏం జరిగిందో ఇప్పుడూ అదే జరుగుతోందని గుర్తు చేశారు. ‘‘ హోటళ్లకు సంబంధించిన భూమి విషయంలో అప్పట్లో వచ్చిన ఆరోపణల్లో తేజశ్వీ యాదవ్‌ పేరును కూడా చేర్చారు. ఈ విచారణను భాజపా తనకు అనుకూలంగా మార్చుకుంది. ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా తేజశ్వీని తొలగించాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. కానీ, ఆర్జేడీ నేతలు అందుకు ఒప్పుకోలేదు. అందుకే స్వయంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి.. 24 గంటల్లోగా భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది’’ అని నీతీశ్‌ కుమార్‌ మీడియాకు తెలిపారు. అయితే, ప్రస్తుతం మహాఘట్‌బంధన్‌ నుంచి జేడీయూ వేరు కాదని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని