Loksabha Elections: బ్యాలెట్‌ పేపర్‌కు బదులు.. బ్యాలెట్‌ పుస్తకం.. అసలేం జరిగింది?

ప్రస్తుతం దిల్లీ శివార్లలో జరుగుతున్న రైతుల నిరసనలు.. దాదాపు మూడు దశాబ్దాల క్రితం నాటి పరిస్థితులను గుర్తు చేస్తున్నాయి.

Published : 01 Apr 2024 00:03 IST

దిల్లీ: దాదాపు 3 దశాబ్దాల క్రితం ప్రభుత్వ విధానాలపై విరక్తి చెందిన తమిళనాడు (TamilNadu) రైతులు ఒకే నియోజకవర్గానికి 1,033 నామినేషన్లు సమర్పించి దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించారు. ఉపసంహరించుకునేందుకు ససేమిరా అనడంతో ఎన్నికల సంఘం బ్యాలెట్‌ పేపర్‌కు (Ballot Paper) బదులు.. అభ్యర్థులందరి పేర్లతో బ్యాలెట్‌ పుస్తకాలను ముద్రించాల్సి వచ్చింది. తాజాగా దిల్లీ, హరియాణా శివారుల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు అప్పటి పరిస్థితులను గుర్తు చేస్తున్నాయి. కనీస మద్దతు ధర చెల్లించడంతోపాటు, వివిధ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పంజాబ్‌ రైతులు గత కొన్ని నెలలుగా దిల్లీ పరిసర ప్రాంతాల్లో నిరసనలు చేస్తున్నారు. అయితే, తమిళనాడు రైతుల మాదిరిగా రాజకీయ మార్గంలోకి వెళ్లే ఆలోచనలేదని పంజాబ్‌ రైతులు చెబుతున్నారు.

భాజపా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నప్పటికీ.. ఎన్నికల్లో పోటీ చేసి నిరసన వ్యక్తం చేసే ఆలోచన లేదని అఖిల భారత కిసాన్‌ సభ సభ్యుడు కిష్ణప్రసాద్‌ మీడియాకు వెల్లడించారు. రాష్ట్రీయ కిసాన్‌ మహాసంఘ్‌ సభ్యుడు అభిమన్యు కోహర్‌ మాట్లాడుతూ.. ‘‘ ఫిబ్రవరి 13 నుంచి దిల్లీ శివార్లలో ఆందోళనలు చేస్తూనే ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని పార్టీల నేతలు రైతులకు అనుకూలంగానే మాట్లాడుతున్నారు. అధికారంలోకి రాగానే.. రైతు వ్యతిరేకులుగా మారి, కార్పొరేట్లకు వత్తాసు పలుకుతున్నారు’’ అని మండిపడ్డారు.

అప్పుడేం జరిగింది?

కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ తమిళనాడుకు చెందిన రైతులు ఆందోళనలకు దిగారు. ప్రభుత్వం నుంచి స్పందన కరవవ్వడంతో 1996 సార్వత్రిక ఎన్నికల్లో ఈరోడ్‌ లోక్‌సభ స్థానానికి 1,033 నామినేషన్లు సమర్పించారు. స్థానిక నేతలు, పలువురు అధికారులు వారితో చర్చించినప్పటికీ ఫలితం లేకపోయింది. నామినేషన్లు చట్టబద్ధంగా ఉండటంతో ఎన్నికల సంఘం కూడా వారిని అడ్డుకోలేకపోయింది. దీంతో వార్తా పత్రికలను పోలినట్లుగా వారి పేర్లతో బ్యాలెట్‌ పుస్తకాలను ముద్రించి పోలింగ్‌ కేంద్రాలకు పంపింది.

ఆ ఎన్నికల్లో డీఎంకే పార్టీకి చెందిన సుబ్బులక్ష్మి జగదీశన్‌ విజయం సాధించారు. రెండో స్థానంలో ఏడీఎంకేకి చెందిన ఆర్‌.ఎన్‌.కిట్టుస్వామి నిలిచారు. వీరిద్దరితో పాటు ఓ స్వతంత్ర అభ్యర్థి మినహా మిగతా వారి డిపాజిట్లు గల్లంతయ్యాయి. 88 మందికి ఒక్క ఓటు కూడా రాకపోగా.. 158 మంది అభ్యర్థులకు ఒకేఒక్క ఓటు నమోదైంది. ఈ ఘటనతో ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. అప్పటి వరకు ఉన్న రూ.500 సెక్యూరిటీ డిపాజిట్‌ను.. ఆ తర్వాతి ఎన్నికల నుంచి రూ.10 వేలకు పెంచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని