India-Maldives: మాల్దీవులు ఆ ప్రతిపాదన చేస్తే.. పరిశీలిస్తాం: భారత్‌

ద్వీపదేశం మాల్దీవులతో ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత్‌ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.

Published : 30 May 2024 21:30 IST

దిల్లీ: ద్వీపదేశం మాల్దీవులతో (Maldives) ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై (Bilateral Free Trade Agreement) భారత్‌ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ఇప్పటివరకు అలాంటి ప్రతిపాదనేమీ చేయలేదని, ఒకవేళ ఆ దేశం ఆసక్తి చూపిస్తే పరిశీలించి, పరిగణనలోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఈమేరకు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ (Randhir Jaiswal) వెల్లడించారు. మాల్దీవులతో స్వేచ్ఛా వాణిజ్యం కోసం భారత్ ప్రయత్నాలు మొదలుపెట్టిందంటూ గతవారం ఆ దేశ వాణిజ్య, ఆర్థికాభివృద్ధి శాఖ మంత్రి మహమ్మద్‌ సయీద్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దీనిపై ప్రశ్నించగా రణధీర్‌ బదులిచ్చారు.

దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతోపాటు, మాల్దీవులతో మరో ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత్‌ అడుగులు వేస్తోందని మాలెలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సయీద్‌ పేర్కొన్నారు. అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు ఈ అవకాశాన్ని అన్ని దేశాలకు ఇస్తారన్నారు. వీలైనన్ని ఎక్కువ దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునేందుకు మాల్దీవులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. గతేడాది నవంబర్‌లో ముయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటినుంచి భారత్‌తో సంబంధాలు అంతంతమాత్రంగానే కొనసాగుతున్నాయి. చైనా అనుకూల విధానాలను అవలంబిస్తూ.. ఆ దేశం భారత్‌కు దూరమవుతోంది. ముయిజ్జు అధ్యక్షుడిగా ఎన్నికైన గంటల వ్యవధిలోనే దేశం నుంచి భారత మిలటరీ దళాలు వెళ్లిపోవాల్సిందిగా గడువు విధించారు. ఈనెల మొదట్లోనే ఈ ప్రక్రియ పూర్తయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని