Air fares: విమాన టికెట్‌ ధరల పెరుగుదలపై సింధియా సమాధానం ఇదే..

విమాన టికెట్‌ ధరల పెరుగుదలపై లోక్‌సభలో సింధియా సమాధానం ఇచ్చారు. ఏటీఎఫ్‌ ధరలతో పోలిస్తే టికెట్‌ ధరలు అంతగా పెరగలేదన్నారు.

Published : 07 Dec 2023 21:18 IST

దిల్లీ: దేశంలో విమానయాన రంగం వేగంగా వృద్ధి చెందుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా అన్నారు. 2014లో ఆరు కోట్లుగా ఉన్న విమాన ప్రయాణికుల సంఖ్య ఇప్పుడు 14.5 కోట్లకు చేరిందని చెప్పారు. ఈ సందర్భంగా విమాన టికెట్‌ ధరల పెరుగుదల అంశాన్ని ఐయూఎంఎల్‌ ఎంపీ బషీర్‌ లేవనెత్తారు. పండగ సీజన్‌, సెలవు రోజుల్లో టికెట్‌ ధరలు అధికంగా ఉంటున్నాయని, ప్రభుత్వం విమానయాన సంస్థల దయకు ప్రయాణికులను వదిలేయకూడదని ప్రస్తావించారు. దీనిపై లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి సమాధానం ఇచ్చారు. పౌర విమానయాన రంగంలో పరిస్థితులను తొలుత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విమానయాన రంగం అనేది సీజన్‌పై ఆధారపడి ఉంటుందని చెప్పారు. 

డీరెగ్యులేట్‌ చేసిన మూలంగా విమానయాన రంగంలో టికెట్‌ ధరల నిర్ణయాధికారం ప్రభుత్వం చేతిలో ఉండదని సింధియా చెప్పారు. అయితే, టికెట్‌ ధరలను నిత్యం 60 రూట్లలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటామని చెప్పారు. విమాన టికెట్లను అడ్వాన్సుగా బుక్‌ చేసుకుంటే.. టికెట్‌ ధరలు తక్కువగా ఉంటాయని, అదే ఆలస్యంగా బుక్‌ చేస్తే ఎక్కువగా ఉంటాయన్నారు. గడిచిన మూడేళ్లలో విమానయాన సంస్థలు రూ.55 వేల కోట్ల నుంచి రూ.1.30 లక్షల కోట్ల మేర నష్టపోయాయని సింధియా తెలిపారు. కొవిడ్‌ ఆయా సంస్థలను ఆర్థికంగా కుంగదీసిందన్నారు. విమానానికి అయ్యే ఖర్చులో ఏటీఎఫ్‌ ధర 40 శాతం వరకు ఉంటుందని చెప్పారు. ఏటీఎఫ్‌ ధరలు మూడింతలు పెరగ్గా.. టికెట్‌ ధరలు మాత్రం ఆ స్థాయిలో పెరగలేదని గుర్తుచేశారు. 2030 నాటికి విమాన ప్రయాణికుల సంఖ్య మూడింతలు పెరిగి 42 కోట్లకు చేరుకుంటుందని అంచనా ఉన్నట్టు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని